3 ఎకరాలు.. 15 కోట్లు.. 108 ఏళ్లు పట్టింది - MicTv.in - Telugu News
mictv telugu

3 ఎకరాలు.. 15 కోట్లు.. 108 ఏళ్లు పట్టింది

May 17, 2022

కోర్టులో కేసు వేసిన తర్వాత అది ఎన్నాళ్లకు తెగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. డబ్బుకు డబ్బు, కాలానికి కాలం ఖర్చవుతూ ఉంటాయి. ఈ పరిస్థితి రాకూడదనే ఇప్పటికీ కొన్ని చోట్ల ఊర్లలో ఏవైనా తగాదా వస్తే కులపెద్దనో, ఊరిపెద్దనో పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరిస్తారు. అయినా కక్షిదారులు మొండికేస్తే మాత్రం ఇదిగో ఇలాంటి పరిస్థితి వస్తుంది. స్వాతంత్ర్యం రాకముందు నుంచి ఉన్న వివాదం ఇప్పటికి తెగింది. అయినా ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందనుకోలేం. ఇప్పుడు చెప్పుకోబోయే అంశం ఇలాంటిదే. దాదాపు 108 ఏళ్ల తర్వాత ఓ భూవివాదరంలో కోర్టు తీర్పునిచ్చింది.

వివరాలు.. బీహార్ రాజధాని పాట్నాకు 40 కిలోమీటర్ల దూరంలోని 3 ఎకరాల భూమిపై రెండు రాజ్‌పుత్ కుటుంబాలకు వివాదముంది. దీంతో యాజమాన్య హక్కుల కోసం ఓ వర్గం 1914లో జిల్లా సివిల్ కోర్టులో కేసు వేసింది. రాజీ కుదుర్చుకునేందుకు ఇరు వర్గాలు ఒప్పుకోలేదు. దీంతో విచారణ తప్పలేదు. అయితే ఇన్నేళ్లకు మార్చి 11న భోజ్‌పూర్ అదనపు జిల్లా జడ్జి శ్వేతా సింగ్ తీర్పు వెల్లడించారు. కేసు వేసిన వర్గానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. కేసు వేసిన దర్బారీ సింగ్ ముని మనవడు అతుల్ సింగ్ తీర్పు కాపీని అందుకున్నాడు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. ‘సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో రెండు కుటుంబాలు కొన్ని తరాల వారసులను కోల్పోయాయి. ఇప్పటికైనా ఈ వివాదానికి ముగింపు పలకండి. లేదూ పైకోర్టుకు వెళతామంటే మీ ఇష్టం. అది ఇంకెన్నేళ్లు పడుతుందో చెప్పలేం’ అని అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం ఆ మూడెకరాలు భూమి ఎకరం రూ. 5 కోట్ల చొప్పున మొత్తం రూ. 15 కోట్ల వరకు ధర పలుకుతోంది.