సన్యాసి వేషంలో నేరగాడు.. షూట్ చేసిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

సన్యాసి వేషంలో నేరగాడు.. షూట్ చేసిన పోలీసులు

May 14, 2022

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో పెళ్లి పేరుతో ఓ మహిళపై నాగరాజు అనే వ్యక్తి యాసిడ్ పోసిన సంఘటన కలకలం రేపింది. నాగరాజు (27) అనే వ్యక్తి గతకొన్ని రోజులుగా 23 ఏళ్ల వయసు ఉన్న ఓ మహిళను ‘నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వుంటే నాకు చాలా ఇష్టం, ఇద్దరం పెళ్లిచేసకుందాం’ అంటూ మహిళను వేధించటం మొదలుపెట్టాడు. అందుకు ఆ మహిళ ఇష్టం లేదని తేల్చి చెప్పింది. దాంతో ఏప్రిల్ 28న నాగరాజు ఆ మహిళ పని చేస్తున్న సంస్ధకు వెళ్లి యాసిడ్ పోసి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయాలతో మహిళ విలవిలాడుతూ, గట్టిగా కేకలు వేసింది. అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా అప్రమత్తమై, ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన డాక్టర్లు.. ఆ మహిళ శరీరం 30 శాతం కాలినట్లు తెలిపారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. ఆచూకి చెప్పిన వారికి నజరానా ఇస్తామని ప్రకటించారు. అయినా, నిందుతుడి ఆచూకి లభించలేదు. ఈ క్రమంలో నిందితుడికి దైవభక్తి అంటే ఇష్టమని, ఎప్పుడు గుళ్లు, గోపురాలు దర్శిస్తాడని సమాచారం అందింది. దాంతో పోలీసులు..ఆశ్రమాలు, దేవాలయాలు, పుణ్యక్షేత్రాలలో తనిఖీ చేయటం ప్రారంభించారు. చివరికి పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో ఉన్నట్లు తెలుసుకున్నారు.

నిందితుడు సాధువు వేషంలో కాషాయం దుస్తులు ధరించి, చాలా శాంత స్వభావుడిగా ఒక ఆశ్రమంలో సేద తీరుతున్నాడని తెలుసుకున్నారు. శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు తిరువణ్ణామలై చేరుకుని, నిందితుడిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి బెంగుళూరు తరలిస్తుండగా, మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకు వస్తానని చెప్పి, పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు నాగరాజు కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు.