నేటి నుంచి అసెంబ్లీలో బడ్జెట్ కేటాయింపులపై చర్చ ప్రారంభంకానుంది. ఈ నెల 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో తొలిరోజు 12 అంశాలు చర్చకు రానున్నాయి. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సాధారణ చర్చ, మంత్రి హరీశ్రావు సమాధానం.. నిన్నటితో ముగిసింది. నేటి నుంచి బడ్జెట్ పద్దులపై మూడురోజులపాటు చర్చ జరగనుంది.
ఈ రోజు ముఖ్యంగా సంక్షేమ పథకాలు, రోడ్లు – భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, లెజిస్లేచర్, పౌరసరఫరాలు, టూరిజం, క్రీడా శాఖలకు చెందిన.. మొత్తం 12 పద్దులపై చర్చచేపడతారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై చర్చసాగనుంది. ప్రశ్నోత్తరాల్లో SRDP,గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, RTC ద్వారా సరుకు రవాణా, కళ్యాణలక్ష్మి పథకం, ఏకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, గనుల రాబడి, సబర్బన్ బస్సుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగడంతో పాటు చర్చకు మంత్రి హరీశ్‌రావు ఇవాళ సమాధానమిస్తారు. మండలిలో నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఈ మూడు రోజుల పాటు ప్రశ్నోత్తరాలను సైతం నిర్వహిస్తారు. 12న ఆదివారం ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెడుతుంది. దానికి సభ ఆమోదం తెలపనుంది. అంతటితో సమావేశాలు ముగుస్తాయి.