కువైత్‌కు తగ్గుతున్న ప్రవాసుల సంఖ్య.. కారణం ఇదేనట? - MicTv.in - Telugu News
mictv telugu

కువైత్‌కు తగ్గుతున్న ప్రవాసుల సంఖ్య.. కారణం ఇదేనట?

March 16, 2022

bfb

గత మూడు సంవత్సరాలుగా గల్ఫ్ దేశం కువైత్‌కు వలసపోయే ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇందుకు ప్రధాన కారణం ఆ దేశం ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిండమే. 2017లో కువైత్ ప్రభుత్వం ‘కువైటైజేషన్ పాలసీ’ని వలసదారులను దృష్టిలో ఉంచుకొని సివిల్ సర్వీస్ కమిషన్ (సీఎస్‌సీ) తీసుకొచ్చింది. అయితే ఈ కువైటైజేషన్ పాలసీ వలసదారుల పట్ల శాపంగా మారింది. కువైత్‌లో పనిచేసే స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పాలసీని తీసుకొచ్చింది.

అయితే, అక్కడి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 2017 నుంచి కువైటైజేషన్ పాలసీని అమలు చేయడం ప్రారంభించాయి. దీంతో గడిచిన ఐదరేళ్లలో ఆ దేశంలో ప్రవాసుల సంఖ్య గణనీయంగా తగ్గడం మొదలైంది. ఇక తాజాగా వెలువడిన సెంట్రల్ స్టాటిస్టికల్ బ్యూరో గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో ఈ సంఖ్య ఏకంగా 3.70 లక్షలకు తగ్గడం గమనార్హం. 2018లో 2,891,255గా ఉన్న ప్రవాసుల సంఖ్య 2021 నాటికి 2,520,301కు పడిపోయింది. ఇదే సమయంలో వర్క్ పర్మిట్ల పొందిన వారి సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. కేవలం 11 వేల మంది మాత్రమే వర్క్ పర్మిట్లు పొందడం జరిగింది. 2018లో 1,07,657 మంది వలసదారులు వర్క్ పర్మిట్లు పొందితే.. 2021లో 96,800 మందికి మాత్రమే వర్క్ పర్మిట్లు దక్కాయి.

మరోవైపు డొమెస్టిక్ వర్కర్ల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2018లో 7,07,000గా ఉంటే, 2021 వచ్చే సరికి 5,91,368కు పడిపోయింది. అంటే మూడేళ్లలో 1,15,700 మంది తగ్గిపోయారు. దీంతో ఆ దేశంలో పని మనుషుల తీవ్ర కొరత ఏర్పడింది. ఇది కరోనా సంక్షోభ సమయంలో తారస్థాయికి చేరింది. ఇక ప్రైవేట్ రంగంలోనైతే వలసదారులు భారీగా తగ్గిపోయారు. 2018లో ప్రైవేట్ సెక్టార్ పని చేస్తున్న ప్రవాసుల సంఖ్య 1,531,000గా ఉంటే, 2021 నాటికి 1,249,000కు తగ్గిపోయింది.

ఇక ఈ మూడేళ్లలో రెసిడెన్సీ ఉల్లంఘనదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు 51వేల మేర ఉల్లంఘనదారులు పెరిగినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. 2018లో ఆ దేశంలో 1,00,560 మంది రెసిడెన్సీ ఉల్లంఘనదారులు ఉంటే, 2021 నాటికి ఈ సంఖ్య 1,51,690కు పెరిగింది. ఇందులో అధిక భాగం డొమెస్టిక్ వర్కర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 48.5శాతం మంది గృహకార్మికులు ఇలా చట్ట విరుద్ధంగా కువైత్‌లో ఉన్నట్లు డేటా చెబుతోంది.