మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ మూవీ ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా హీరో రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించారు. ధర్మస్థలి, పాదఘట్టం, సిద్ధవనం అని ఏవేవో కాన్సెప్టులతో సినిమాను సక్సెస్ ఫుల్‌గా అట్టర్ ఫ్లాప్ చేయించారు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. ఈ మూవీ కోసం భారీ నిర్మాణంతో ధర్మస్థలి టెంపుల్ సెట్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఆ టెంపుల్ సెట్‌కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెట్ మొత్తం మంటల్లో కాలిపోతున్నట్లుగా చూపుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఫైర్ ఇన్సిడెంట్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది బాగా వైరల్ గా మారింది. మెయిన్ ఎంట్రెన్స్ వద్ద కూర్చుని ఎవరో సిగరెట్ తాగి ముక్క పడేసారని.. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్ లో మంటలు చెలరేగాయని దీని రికార్డు చేసిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. దగ్గర్లో నీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో మంటలు పూర్తిగా వ్యాపించక ముందే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేయడంతో హుటా హుటిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేసే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో సుమారు 20 ఎకరాల్లో సురేష్ సెల్వరాజన్ నిర్మించిన ఈ సెట్ కి రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా కొందరు చేసిన తప్పిదం వల్ల కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.