'ది వారియర్' దర్శకుడికి ఆరు నెలల జైలు శిక్ష..ఎందుకో తెలుసా?
టాలీవుడ్‌లో ఎనర్జీటిక్ స్టార్‌గా పేరుగాంచిన రామ్ పోతినేని హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగుస్వామి తాజాగా తెరకెక్కించిన చిత్రం 'ది వారియర్'. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. కానీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే, ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ లింగుస్వామికి చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. ఈ శిక్షకు సంబంధించిన పూర్తి వివరాలను మరొక్కసారి గుర్తుచేస్తూ, తుది తీర్పును సోమవారం వెల్లడించింది.
వివరాల్లోకి వెళ్తే..కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామికి చెక్‌బౌన్స్ కేసులో చెన్నైలోని సైదాపేట్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కొన్ని సంవత్సరాల క్రితం.. కార్తి, సమంత జంటగా ‘ఎన్నిఇజు నాల్ కుల్ల’ పేరుతో ఓ సినిమా తీయాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీవీపీ సినిమాస్ నుంచి అప్పు తీసుకున్నారు. కానీ, ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో పీవీపీ సినిమాస్ నుంచి తీసుకున్న సొమ్మును చెక్కు రూపంలో తిరిగి చెల్లించారు. అయితే, వారిచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. నిన్న ఈ కేసు విచారణకు రాగా, లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్‌లకు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
లింగుస్వామి దర్శకుడు మాత్రమే కాదు. నిర్మాత కూడా. తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ హౌస్‌పై పలు సినిమాలను కూడా ఆయన నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ పైనా కూడా పలు కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో వీపీ సినిమాస్ నుంచి తీసుకున్న అప్పుల విషయంలో చెక్‌బౌన్స్ కావడంతో లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. దీంతో తమిళ ఇండస్ట్రీలో ఒక్కసారిగా కలకలం రేగింది.