బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు సంబంధించి ఓ వార్త గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా రణ్‌బీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, నాగార్జునలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను సామాజిక మాధ్యమాల ద్వారా చిత్రబృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ ట్రైలర్లో.. రణ్‌బీర్ కపూర్ కాళ్లకు షూలు వేసుకొని ఆలయంలోకి ప్రవేశించి, షూలతోనే గుడిగంట మోగించాడు. ఆ సీన్‌పై కొంతమంది నెటిజన్స్ ఆలయంలోకి చెప్పులు వేసుకుని ఎలా వెళ్తారంటూ మండిపడుతూ, బ్రహ్మాస్త్ర మూవీని నిషేధించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ స్పందించాడు.
”రణ్‌బీర్ కాళ్లకు షూలు వేసుకుని గుడిగంట మోగించడంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక భక్తుడిగా, సినిమా దర్శకుడిగా అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీ ఇస్తాను. రణ్‌బీర్ కాళ్లకు షూలు వేసుకుని ఆలయంలో అడుగుపెట్టలేదు. దుర్గాదేవి పూజా మండపంలోకి వెళ్లాడు. 75 ఏళ్లుగా మా కుటుంబం దుర్గా పూజను నిర్వహిస్తోంది. నాకున్న అనుభవం కొద్దీ చెప్తున్నా, మండపంలోకి కాళ్లకు చెప్పులు వేసుకునే వెళ్తాం. కానీ, అమ్మవారి ముందుకు వెళ్లేటప్పుడు మాత్రం వాటిని పక్కన విడిచేసి దర్శనం చేసుకుంటాం. అక్కడ జరిగింది అదే. భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకే ఈ సినిమాను తీశాం. అంతే తప్ప ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు’ అని ఆయన అన్నారు.