‘కశ్మీర్ ఫైల్స్’ పోయి ‘ఢిల్లీ ఫైల్స్’ వచ్చె.. ఢాం ఢాం.. - MicTv.in - Telugu News
mictv telugu

‘కశ్మీర్ ఫైల్స్’ పోయి ‘ఢిల్లీ ఫైల్స్’ వచ్చె.. ఢాం ఢాం..

April 21, 2022

ddddd

ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలైన ‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాలీవుడ్‌ ఆశ్చర్యపోయేలా విజయం సాధించింది. అనేక విమర్శల నడుమ అనూహ్యంగా రూ. 250 కోట్లు కొల్లగొట్టింది. కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాలపై తీసిన ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించాడు. ఈ సక్సెస్‌తో వివేక్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఢిల్లీలో జరిగిన సిక్కు అల్లర్ల నేపథ్యంలో ‘ద ఢిల్లీ ఫైల్స్’ తీస్తున్నట్టు మీడియా ముఖంగా ప్రకటించాడు. దీంతో ఈ చిత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాకముందే విమర్శలనెదుర్కొంటోంది. తాజాగా మహారాష్ట్ర సిక్కు సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. చరిత్రలో జరిగిన ఓ విషాద ఘటన ఆధారంగా చిత్రం తీసి ప్రశాంతంగా బతుకుతున్న సమాజంలో అశాంతి రేపవద్దని దర్శకుడికి సూచించింది. స్వలాభం కొరకు ఈ సినిమా తీయడం తప్ప ఎవరికీ దీని వల్ల లాభం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ‘భారత రాజ్యాంగం ప్రకారం నాకున్న భావవ్యక్తీకరణ స్వేచ్ఛతో నేను సినిమాలు తీస్తున్నాను. వారి డిమాండ్లకు తల వంచడానికి నేను వారి సేవకుడిని కాదు. కథ, కథనం తెలియకుండా ఎవరికి వారు ఊహించుకొని విమర్శిస్తున్నారు. నేను సినిమా తీయడం ఖాయం. దానిని విడుదల చేయాలా? వద్దా? అనేది సెన్సార్ బోర్డు నిర్ణయిస్తుంది’ అని అభిప్రాయపడ్డారు.