The doctor sold the newborn baby girl in uttar pradesh
mictv telugu

డెలివరీ ఖర్చు తీసుకోనంటూ డాక్టరు చేసిన నిర్వాకం ఇదీ

September 9, 2022

ఉన్నత చదువులు చదివి పవిత్రమైన వృత్తిలో ఉన్న డాక్టర్లు ఈ మధ్య కళంకం తెచ్చే పనులు చేస్తున్నారు. అమాయకులను మోసం చేయడం, చనిపోయినా వైద్యం పేరిట డబ్బు వసూలు చేయడం వంటివి రెగ్యులర్‌గా చూస్తున్నాం. కానీ, ఉత్తరప్రదేశ్‌లో ఓ వైద్యుడు మాత్రం బ్రోకరేజీ పని చేశాడు. పేద దంపతులకు పుట్టిన ఆడబిడ్డను వారి నుంచి బలవంతంగా తీసుకొని పిల్లలు లేని కుటుంబానికి ఇచ్చేశాడు. ఇందుకు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. స్థానికంగా సంచలనమైన ఈ నీచ ఘటన షాజహాన్‌పూర్ ప్రాంతంలోని నిగోహి పట్టణంలో జరిగింది. వివరాల్లోకెళితే.. స్థానిక నవజీవన్ హాస్పిటల్‌లో ఓ పేద హిందూ దంపతులు ప్రసవం కోసం వచ్చారు. ఈ దంపతులకు అప్పటికే ఐదుగురు ఆడపిల్లలు ఉండగా, ఆరోసారి ఆడబిడ్డ పుట్టడంతో డాక్టరు వారి పరిస్థితిని ఆసరాగా తీసుకున్న దుర్మార్గానికి పాల్పడ్డాడు. దంపతులు డెలివరీ ఖర్చు చెల్లించడానికి ఇబ్బంది పడడంతో ‘మీకు ఇప్పటికే ఐదుగురు ఆడపిల్లలున్నారు. ఇక ఈ అమ్మాయిని ఎలా పోషిస్తావు. డెలివరీ ఖర్చు కూడా ఇవ్వద్దు. బిడ్డను తీసుకెళ్తా’నని బలవంతం చేశాడని బిడ్డ తండ్రి ఆరోపించాడు. ఆ బిడ్డను ఓ ముస్లిం దంపతులకు భారీ మొత్తానికి డాక్టరు విక్రయించగా, విషయం తెలుసుకున్న స్థానిక హిందూ సంస్థ నాయకుడు రాజేశ్ అవస్థి తన కార్యకర్తలతో కలిసి ఆందోళన నిర్వహించారు. వెంటనే డాక్టరుని అరెస్ట్ చేసి ఆసుపత్రిని సీల్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన అధికారులు ఆస్పత్రిని సీల్ చేయగా, డాక్టరు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.