The doctor who frightened his wife in the name of the devil
mictv telugu

అదనపు కట్నం కోసం ‘దెయ్యం’తో వేధింపులు.. రెండో భర్తపై కేసు

June 9, 2022

The doctor who frightened his wife in the name of the devil

గుజరాత్‌లో విచిత్ర కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం చనిపోయిన తన మొదటి భార్య దెయ్యమై వేధిస్తుందంటూ రెండో భార్యను హింసించాడు రెండో భర్త. దాంతో ఆమె తన రెండో భర్తపై కేసు పెట్టింది. పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళకు (43) గుజరాత్‌కు చెందిన ఓ డాక్టరుతో పెళ్లయింది. ఇద్దరికీ ఇది రెండో వివాహమే. మహిళకు మొదటి భర్త ద్వారా ఇద్దరు పిల్లలు కలుగగా, అతనికి విడాకులిచ్చి, డాక్టరును పెళ్లి చేసుకుంది. ఇక డాక్టరు వైపు చూస్తే అతని మొదటి భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఇద్దరి అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోగా, ఇద్దరి పిల్లలు ఒకే దగ్గర ఉంటున్నారు. ఇలా కొన్నాళ్లు గడిచిన తర్వాత డాక్టరు తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. మహిళకు మొదటి భర్త ద్వారా కలిగిన ఇద్దరు పిల్లలను దూరం పెట్టసాగాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు జరుగగా, పెద్ద మనుషులు పంచాయితీ పెట్టి డాక్టరుకి నచ్చజెప్పి పంపించేశారు. దాంతో కొత్త ఎత్తుగడ వేసిన డాక్టరు.. తాను కొత్తగా నిర్మించబోయే ఆసుపత్రి నిమిత్తం 50 లక్షలు అదనపు కట్నం కావాలని ఒత్తిడి తేసాగాడు. లేకపోతే ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తన మొదటి భార్య దెయ్యంగా మారి నిన్ను చంపేస్తుందని భయపెట్టసాగాడు. డబ్బు తెస్తే దెయ్యం నిన్నేమీ చేయదని నమ్మబలికాడు. తన పుట్టింటివారు అంత ధనవంతులు కాదని ఆమె ఎంత మొత్తుకున్నా వినకుండా ప్రతీరోజు దెయ్యం పేరుతో కొట్టడం మొదలుపెట్టాడు. ఆమెతో పాటు ఆమె ఇద్దరి పిల్లలను గదిలో బంధించి వేధించసాగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి తన రెండో భర్త నుంచి తనను కాపాడాలని వేడుకుంది. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, డాక్టరు అయి ఉండి అదనపు కట్నం డబ్బుల కోసం దెయ్యం స్టోరీ చెప్పడం ఏంటని పలువురు వాపోతున్నారు.