ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. వెంకటాపురం మండలం వీరభద్రపురం రాగానే డ్రైవింగ్ చేస్తూ సీట్లోనే ఒక్కసారిగా కూలిపోయాడు. దీంతో బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సమయంలో బస్సులో 40 మంద్రి ప్రయాణికులు ఉండగా వారంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్‌ను కిందకు దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు కాణిపాకం నుంచి 45 మంది భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కొన్నిసార్లు డ్రైవర్లు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. వారం రోజుల కిందట గుజరాత్లో ఇలాంటి తరహా ప్రమాదమే జరిగింది. బస్సు డ్రైవర్‌కు గుండె పోటు రావడంతో కారును ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మందిలో 8 మంది మరణించారు. ఈ ఘటనలో బస్సు ప్రయాణికుల్లో 28 మంది గాయాలపాలయ్యారు. వారిలో తీవ్రంగా గాయపడిన 11 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.