భారీ జంతువు ఏనుగుకు ఆహారంగా చెరకు వేసినందుకు గాను ఓ లారీ డ్రైవర్ రూ. 75 వేల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటనపై జంతుప్రేమికులు, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అందులో మీకేం తప్పు కనిపించిందని అధికారుల తీరును ఎండగడుతున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ ఆసనూర్ సమీపంలోని జాతీయ రహదారిపై చెరకు లారీలు ప్రయాణిస్తుంటాయి. దీన్ని పసిగట్టిన ఏనుగులు తరచూ లారీలకు అడ్డం వచ్చి నిల్చుండడం సాధారణంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో మైసూరుకు చెందిన సిద్ధరాజు అనే లారీ డ్రైవర్ చెరకు లారీతో రహదారిపై వెళ్తుండగా ఓ గజరాజు అడ్డుకుంది. పరిస్ధితిని అర్ధం చేసుకున్న సిద్ధరాజు ఏనుగుకు ఆహారంగా చెరకు గడలను విసిరాడు. పెట్రోలింగ్ లో భాగంగా అక్కడే గస్తీ తిరుగుతున్న స్థానిక అటవీ శాఖ సిబ్బంది అది చూసి ఏనుగుకు చెరకు వేసినందుకు శిక్షగా డ్రైవరుకి జరిమానా విధించారు. జరిమానా చెల్లించేవరకు లారీని వదలకపోవడంతో తప్పనిసరి పరిస్థితిల్లో సిద్ధరాజు రూ. 75 వేల జరిమానాను చెల్లించుకున్నాడు.