The dwarf who sued the parents for his marriage
mictv telugu

ఆగే ఓపిక లేదు, అర్జెంటుగా పెళ్లి చేయండి – కేసు పెట్టిన మరుగుజ్జు

May 14, 2022

పెళ్లి గురించి ఆ మధ్య జబర్దస్త్ స్కిట్టులో ఓ డైలాగ్ బాగా పాపులర్ అయింది. ‘పెళ్లి అనేది ఓ ఇల్లు లాంటిది. చేసుకున్న వాళ్లు అక్కడనుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని చూస్తారు. అదే పెళ్లి కాని వాళ్లు ఆ ఇంట్లోకి ఎప్పుడు వెళదామా అని ఎదురుచూస్తుంటారు’ ఇది ఓ జోక్ అయినా ఇందులో కొంత వాస్తవం ఉంది. తాజాగా పెళ్లికి ఆరాటపడే ఓ మరుగుజ్జు కథ పై డైలాగుని గుర్తుకు తెస్తోంది. వివరాల్లోకెళితే.. ఉత్తరప్రదేశ్‌కి చెందిన అజీమ్ మన్సూరీ అనే 26 ఏళ్ల వ్యక్తి మూడడుగుల రెండు అంగుళాల పొడవుంటాడు.

మరుగుజ్జు కావడంతో తనకు పిల్ల దొరక్క పెళ్లి కావట్లేదని గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మీడియా ముందుకు రావడంతో అప్పట్లో వార్తల్లో నిలిచాడు. అయితే కొన్నాళ్లకి ఈ విషయం తెలిసి రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న రెహానా అనే యువతితో పెళ్లి కుదిర్చారు. అంతా సవ్యంగా ఉందనుకుంటుండగా ఇప్పుడతనికి మరో కష్టం వచ్చింది. మన్సూరీ మళ్లీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ సారి కారణం చూసి విస్తుపోవడం పోలీసుల వంతైంది. తనకు పిల్ల దొరికి నిశ్చితార్ధం కూడా అయిందనీ, అయినా తల్లిదండ్రులు తన పెళ్లి చేయట్లేదని అతని ఫిర్యాదు సారాంశం. కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేస్తామని వారు చెప్తున్నా వినకుండా, అంతవరకు ఆగే ఓపిక తనకు లేదని అందుకే వారిపై కంప్లైంట్ ఇస్తున్నట్టు తెలిపాడు. దాంతో పోలీసులు అతని తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు.