ఆ దేశపు చదువులు మనకొద్దు: యూజీసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆ దేశపు చదువులు మనకొద్దు: యూజీసీ

April 23, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) భారత విద్యార్థులకు ఓ ముఖ్య విషయాన్ని తెలియజేసింది. చదువుల కోసం పాకిస్తాన్ విద్యా సంస్థల్లో ఎవరూ తమ పేరును నమోదు చేసుకోవద్దని యూజీసీ, ఏఐసీటీఈ భారత విద్యార్ధులను కోరింది. అంతేకాకుండా దీన్ని ఉల్లంఘించిన వారు భారత్‌లో పై చదువులకు గాని, ఉద్యోగాలకు గాని అర్హులు కాదని తేల్చి చెప్పింది. పై చదువుల కోసం ఇండియా నుంచి ఎవరూ పాకిస్తాన్‌కు వెళోద్దని హెచ్చరించింది.

ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్దే మాట్లాడుతూ..” భారత పౌరులు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా విద్యార్థులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. పాక్ నుంచి భారత్‌కు వలస వచ్చినవారు, వారి పిల్లలు ఇక్కడి పౌరసత్వం పొంది ఉంటే, ఇక్కడి ఉద్యోగాలకు అర్హులు. వారు కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొంది ఉండాలి. భారత ప్రమాణాలకు అనుగుణంగా లేని డిగ్రీలను పొంది, విద్యార్థులు ఇబ్బందులు పడొద్దు” అని ఆయన అన్నారు.

మరోపక్క భారత్ వెలుపల విద్యనభ్యసించాలనుకునే విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ మార్గదర్శకాలను జారీ చేశామని యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల కొంతమంది విదేశాల నుంచి తిరిగొచ్చి, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో గమనించామన్నారు. పరోక్షంగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల సమస్యలను ఉద్దేశించి, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని విద్యాసంస్థల్లోనూ విద్యనభ్యసించడాన్ని నిషేధిస్తూ 2019లోనే యూజీసీ మార్గ దర్శకాలు జారీ చేసింది.