The Election Commission rejected the TBJP's proposal on cm kcr
mictv telugu

టీబీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్.. సంతోషంలో టీఆర్ఎస్

August 11, 2022

తెలంగాణ బీజేపీ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆ పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యంగా రూపొందించిన ‘సాలు దొర – సెలవు దొర’ ప్రకటనలపై నిషేధం విధించింది. ఈ విధంగా పోస్టర్లు ముద్రించడానికి నిరాకరించింది. పొలిటికల్ లీడర్లను కించపరిచే విధంగా ఫోటోలు, రాతలు, వీడియోలు, పోస్టర్లు ఉండరాదని కచ్చితంగా తేల్చి చెప్పేసింది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతిని తోసిపుచ్చింది. ఇటీవల బీజేపీ తన కార్యాలయంలో సాలు దొర – సెలవు దొర అనే పేరుతో ప్రకటనలు చేసింది. దానికి బదులుగా ప్రధాని మోదీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్లు ప్రతిగా సాలు మోదీ – సంపకు మోదీ అంటూ కౌంటరిచ్చారు. దీనిపై రెండు పార్టీల మధ్య పరోక్ష ప్రతీకార యుద్ధం నడిచింది. ఈ అంశం వివాదాస్పదమవగా, అక్కడితోనే ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ, బీజేపీ దీనినే ప్రధానాస్త్రంగా ఉపయోగించి లబ్ది పొందాలని చూసింది. కేంద్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉన్నా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచుకోవడంతో బీజేపీకి నిరాశ తప్పలేదు. ఈ పరిణామంపై టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభ్యుదయ వాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విమర్శలు పరిమితికి లోబడి ఉండాలని, కించపరిచే విధంగా ఉండకూడదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో బీజేపీ సభ్యత, సంస్కారాలు నేర్చుకోవాలని వారు పేర్కొంటున్నారు.