భారత్‌కు మరో అస్కార్ అవార్డ్ తెచ్చిన 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' - Telugu News - Mic tv
mictv telugu

భారత్‌కు మరో అస్కార్ అవార్డ్ తెచ్చిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’

March 13, 2023

 

the-elephant-whisperers-wins-best-documentary-short film

ఈ ఏడాది ఆస్కార్ సంబరాలు మన దేశం ముంగిట్లోకి వచ్చి వాలాయి. రెండు అవార్డులను మన దేశం సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్‌తో టాలీవుడ్ ఘనత ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాము. అలాగే మరోవైపు బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్  కేటగిరిలో కూడా మన దేశానికే అవార్డ్ వచ్చింది. కార్తి గోన్ సాల్వెస్ తీసిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు అవార్డ్ దక్కింది.

ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఇదొక చిన్న సినిమా. అసలు మొత్తం సినిమానే కాదు. డాక్యుమెంటరీ ఫిల్మ్. అయితేనేం మన దేశానికి ఆస్కార్ అవార్డ్ తెచ్చి పెట్టింది. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన భార్యాభర్తల కథే ఈ డాక్యుమెంటరీ.  42 నిమిషాల ఉండే ఈ మూవీలో మొత్తం ఆ భార్యాభర్తలు, ఏనుగులు మాత్రమే కనిపిస్తారు. దీని కోసం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించారు. కార్తికి ఇదే మొదటి సినిమా కూడా. తన తొలి సినిమాకే ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించారు కార్తీ గోన్ సాల్వెస్. తన శ్రమను గుర్తించి అవార్డ్ అందించి, ప్రతిష్టాత్మక అవార్డ్ అందించిన అకాడమీ బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. కార్తీతోపాటూ నిర్మాత గునీత్ మోగ్న కూడా అవార్డ్ అందుకున్నారు.

the-elephant-whisperers-wins-best-documentary-short film

మూవీకి కారణమైనన సంఘటన:

కార్తీ ఓ ప్రకృతి ప్రేమికురాలు. ఊటీలో పుట్టి పెరిగిన ఆమె నీలగిరి జీవావరణ రిజర్వ్ లో పెరిగింది. ఆమె చిన్నప్పటి నుంచి చూస్తున్న పరిసరాలు, జంతువుల మీద అందరికీ అవగాహన కల్పించాలనుకుంది. దానికోసం ఫోటోగ్రఫీ నేర్చుకుంది. విజువల్ కమ్యూనికేషన్, ఫిల్మ్ మేకింగ్ లో పీజీ చేసింది. కార్తీతో పాటే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా పర్యావరణ ప్రేమికులే. అయితే వీటన్నింటి కంటే 5 ఏళ్ళ క్రితం తాను చూసిన ఓ సంఘటనే తనను మూవీ తీసేలా ప్రేరేపించిందని చెబుతున్నారు కార్తీ. ఓ రోజు తాను ఇంటికి వెళుతున్నప్పుడు ఓ వ్యక్తి ఏనుగు పిల్లతో వెళ్లడం గమనించారట. వాళ్ళిద్దరి మధ్యా ఉన్న అనుబంధం ఆశ్చర్యపరిచిందని, అతనితో మాట్లాడితే తప్పిపోయిన ఏనుగు పిల్లను అతను చేరదీసిన విధానం చెప్పాడని చెప్పారు. ఆ సంఘటనే తన కెరియర్ ను మలుపు తిప్పిందని అంటున్నారు. అదే ది ఎలిఫెంట్ విస్పరర్స్ మూవీకి ప్రేరణ అని కార్తీ గర్వంగా ప్రటించారు.

450 గంటల ఫుటేజీ:

సినిమాలో యాక్ట్ చేసిన బొమన్, బెల్లీ ఇద్దరూ నిజంగానే ఆ ఏనుగు పిల్లలని పెంచుతున్నారు. వాళ్ళ అనుబంధమే కథగా తీసానని అంటున్నారు కార్తీ. అయితే వాళ్ళ కథను హడావుడిగా ముగించడం తనకు ఇష్టం లేదని అందుకే ఓపికగా బోలెడంత ఫుటేజీని చిత్రీకరించామని చెప్పారు. మొత్తం భావోద్వేగాలను చూపించాలనుకున్నారుట కార్తీ. దాని కోసం వాళ్ళతో 18 నెలలు అనుబంధాన్ని పెంచుకున్నారు. వాళ్ళ ఎదురుగుండా కెమెరా లేదు అన్నట్టు చేయాల్సి వచ్చింది. మొత్తం 450 గంటల ఫుటేజీని చిత్రీకరించాల్సి వచ్చింది. కరెక్ట్ గా అదే సమయంలో బొమన్, బెల్లీ పెళ్ళి చేసుకున్నారు. అలా కట్టనాయగన్ తెగ సంస్కృతినీ సినిమాలో తెలిపే అవకాశం వచ్చింది కార్తీకి. సినిమా తీసినప్పుడు చాలా ప్రమాదాలు ఎదుర్కొన్నారుట. అడవిలో సినిమా తీయడం అంత ఈజీ కాదని చాలా అపాయాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే సినిమా పూర్తయ్యాక అవన్నీ అందమైన అనుభవాలే అయ్యాయని అంటున్నారు.