గాల్లో ఉండగా విమానానికి పడ్డ రంధ్రం.. ఆందోళనలో ప్రయాణీకులు - MicTv.in - Telugu News
mictv telugu

గాల్లో ఉండగా విమానానికి పడ్డ రంధ్రం.. ఆందోళనలో ప్రయాణీకులు

July 5, 2022

ఇదో విచిత్ర ఘటన. దాదాపు చరిత్రలో ఇంతవరకు జరగలేదనుకుంటా. గాల్లో ప్రయాణిస్తున్న విమానానికి రంద్రం పడింది. అయితే పైలెట్లు చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించారు. కానీ, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అప్పటివరకు ఆందోళన చెందిన ప్రయాణీకులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. జులై 1న జరిగి ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్ బస్ ఏ380 అనే విమానం దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్తోంది. అక్కడికి చేరుకోవడానికి కొద్ది ముందు ఏదో పెద్ద శబ్దం వచ్చింది. బహుశా టైరు పేలిపోయి ఉంటుందని భావించిన పైలెట్లు అత్యవసరంగా దిగడానికి ఏటీసీ అనుమతి అడిగారు. సురక్షితంగా ల్యాండ్ అయ్యాక ఎడమ రెక్క కింది భాగంలో పడ్డ రంద్రాన్ని గుర్తించారు. అంతకు ముందు పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది విమానం ఇంజిను, రెక్కలను తనిఖీ చేయగా, ఎలాంటి లోపం కనపడలేదు. రంద్రం వల్ల విమాన లోపలి భాగం, ఫ్రేమ్, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదు. అలాగే ఎవరూ కూడా గాయపడలేదు. కానీ, పెద్ద శబ్దం వచ్చినప్పుడు మాత్రం ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు మానసిక ఆందోళనకు గురయ్యామని వారు స్థానిక మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఆ విమానం బ్రిస్బేన్ విమానాశ్రయంలోనే ఉందని ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు. కాగా, రంద్రం ఎలా పడిందన్న దానిపై విచారణ కొనసాగుతోంది.