The father asked HRC to save his son from the woman
mictv telugu

యువకుడిని కొంగున కట్టేసుకున్న మహిళ.. హెచ్చార్సీకి తండ్రి ఫిర్యాదు

August 13, 2022

తన కుమారుడిని వలలో వేసుకున్న మహిళ నుంచి కాపాడాలని ఓ తండ్రి మానవ హక్కుల కమిషన్ మెట్లెక్కాడు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న తన కుమారుడు (19)ని స్థానికంగా ఉండే ఓ మహిళ (30) ప్రేమ పేరుతో లోబరుచుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన ఫిర్యాదుదారుడు ప్రైవేటు కాలేజీలో అధ్యాపకుడు. అతని కుమారుడిని ఓ మహిళ జూన్ 26న ఇంటి నుంచి లేపుకెళ్లగా, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే యువకుడు మేజర్ కాబట్టి మేమేం చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు. అందుకే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నాడు. ఎలాగైనా తమ కుమారుడిని మహిళ చెర నుంచి విముక్తి కలిగించి తిరిగి తమ చెంత చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇటీవలే ఏపీలో నలుగురు పిల్లలున్న ఓ మహిళ ఎదురింట్లో ఉండే ఓ మైనర్ కుర్రాడిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి హైదరాబాదుకు తీసుకొచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని బాలానగర్ ప్రాంతంలో వారిని పట్టుకొని యువకుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఇక్కడ అబ్బాయి మేజర్ కావడంతో అలా జరిగే అవకాశం లేదు. దీంతో బాధితుడు లబోదిబో మంటున్నాడు.