The father cried after seeing his son's mark list
mictv telugu

కొడుకు మార్కుల లిస్టు చూసి భోరున ఏడ్చిన తండ్రి.. వీడియో వైరల్

July 2, 2022

కొడుకు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని బాగుపడాలని ప్రతీ తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకోసం వారికి కావాల్సినవన్నీ కొని తెచ్చి పెడతారు. ఇక్కడ ఓ తండ్రి అంతటితో ఆగక, కొడుకు కోసం తానే స్వయంగా టీచర్ అవతారం ఎత్తాడు. చివరికి కొడుకుకి వచ్చిన మార్కులు చూసి గుక్కపెట్టి ఏడ్వడం మొదలెట్టాడు. చైనాలో వైరల్ అవుతున్న ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హెనాన్‌లోని జెంగ్‌జౌలో నివసించే ఓ తండ్రి తన కొడుకు లెక్కల్లో మంచి మార్కులు సాధించాలనే తలంపుతో ఏడాది పాటు ఇంట్లోనే లెక్కలు బోధించాడు. దీని కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా కొంతవరకు త్యాగం చేశాడు. తండ్రి శిక్షణలో లెక్కలు నేర్చుకున్న ఆ అబ్బాయి మొదట్లో బాగానే చదివేవాడు. మామూలు పరీక్షల్లో నూటికి 40, 50, 60, 80, 90 ఇలా మార్కులు వచ్చేవి. అయితే ఫైనల్ ఎగ్జామ్‌లో మాత్రం ఇంకెక్కువ మార్కలు వస్తాయనుకుంటే నూటికి కేవలం ఆరు మార్కులు మాత్రమే వచ్చాయి. ఈ మార్కుల లిస్టు చూసిన తండ్రి హతాశుడయ్యాడు. బాధ భరించలేక ఏడ్వడం మొదలెట్టాడు. దుఖంతో ఇక నావల్ల కాదు. నేను చేసిందంతా వేస్ట్ అయింది. ఇక నుంచి వాడంతట వాడే కష్టపడనీ అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. ఈ వీడియో నెట్‌లో పెట్టడంతో ఇప్పటివరకు సుమారు పది లక్షల వ్యూస్ వచ్చాయి. అయితే ఆ విద్యార్ధికి చదువు అబ్బలేదా? లేక కావాలనే అలా చేశాడా? అనేది తెలియరాలేదు.