హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని గ్రీన్ బావర్చి హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో భారీగా మంటలు ఎగసిపడుతుండడంతో మంటల ధాటికి హోటల్లోని జనం, సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో బిల్డింగ్‌లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. మొదటి అంతస్తులో గ్రీన్ బావర్చి, 2,3 అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఐటీ కంపెనీలు ఉన్న అంతస్తులో పొగ అలుముకుంది. కాగా, హోటల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే భవనం పైన ఉన్న 14 మందిని కాపాడారు. భవనం లోపల ఇంకా కొంతమంది ఉన్నట్టు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు క్రేన్ ద్వారా కిందకి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బందిపడినవారికి ప్రాథమిక చికిత్స అందించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. ఆ హోటల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.