బీబీసీ 100 ప్రభావవంతమైన మహిళల జాబితాను ప్రకటించింది. అందులో కేవలం ఈ నలుగురే భారతీయ మహిళలకు చోటు దక్కింది. మరి వారి గురించి తెలుసుకోకపోతే ఎలా?!
ప్రతి సంవత్సరంలాగే బీబీసీ ఈ సంవత్సరం కూడా ప్రభావవంతమైన మహిళల జాబితాను విడుదల చేసింది. రాజకీయం, సినిమా, లిటరేచర్, ఆటలు, సాంకేతిక రంగాల్లో ఉన్న మహిళలను ఎంచుకున్నారు. అందులో మన భారతీయులకు కూడా చోటు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందిన ఆ నలుగురు గురించి కొన్ని వివరాలు మీకోసం ఇస్తున్నాం చదువండి..
ప్రియాంక చోప్రా
బాలీవుడ్ నటిగా, అందాల సుందరిగా ఈమె సుపరిచితురాలు. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. బీహార్ లోని జంషెడ్పూర్ లో పుట్టి పెరిగిన ఈమెకు 2016లో భారత ప్రభుత్వం గౌరవ పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది. ఇది కాకుండా రెండు నేషనల్ అవార్డ్స్, మరెన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆమెను వరించాయి. 2018లో అమెరికన్ సింగర్, యాక్టర్ అయిన నిక్ జోనస్ ని వివాహం చేసుకొని వార్తల్లోకి ఎక్కింది. ఈ మధ్యే సరోగసీ ద్వారా బిడ్డను కూడా కన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు, హాలీవుడ్ లోనూ తను అడుగుపెట్టి సక్సెస్ సాధించింది. సినిమాలే కాకుండా హెయిర్ కేర్ బ్రాండ్, రెస్టారెంట్, హోమ్ వేర్, టెక్ ఇండస్ట్రీలోనూ అడుగు పెట్టింది. అటు నటిగానూ, ఇటు వ్యాపారవేత్తగా కూడా సక్సెస్ రన్ లో ఉంది ప్రియాంక. అప్పుడప్పుడు పేపర్లలో కాలమ్స్ రాసే అలవాటు కూడా ఉందామెకు. ఇప్పటివరకు 50 కాలమ్స్ వరకు రాసిన అనుభవం ఉంది.
శిరీష బండ్ల
గుంటూరుకి చెందిన శిరీషా ఇండియన్-అమెరికన్ ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివింది. ఈ అమ్మాయి భారతదేశంలో జన్మించిన రెండో వ్యక్తిగా అంతరిక్ష ప్రయాణం చేసింది. మొత్తంగా చూస్తే భారతదేశం నుంచి నాలుగో వ్యక్తి శిరీష. ఆమె వర్జిన్ గెలాక్టిక్ కోసం ప్రభుత్వం వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నది. శిరీష గుంటూరు నుంచి తెనాలి, ఆ పై హైదరాబాద్, చివరకు హోస్టన్ చేరింది. పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ది జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ సాధించింది. చిన్నప్పటి నుంచి శిరీషకి ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలను అన్వేషించాలనుకునేది. ఇప్పుడు తన కల సాకారం చేసుకోవడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నది.
స్నేహ జ్వాలే
స్నేహ లా చదువుకోవాలనుకున్న అమ్మాయి. కానీ ఆమె తల్లిదండ్రులు అందరి తల్లిదండ్రుల్లాగే ఆలోచించారు. పెండ్లి చేసి పంపించాలని అనుకున్నారు. పెండ్లి అయిన తర్వాత నుంచి రోజు ఆమెకు నరకమే. దెబ్బలు తినని రోజంటూ లేదు. ఇంకా చెప్పాలంటే అత్తారింట్లో ఆమె ఒక పనిమనిషిలా మారింది. అత్తమామలు స్నేహను చంపాలని కూడా ప్రయత్నించారు. కానీ అది కుదరలేదు. కొన్నిరోజులకు ఆమెకు కొడుకు పుట్టాడు. అప్పుడయిన అత్తమామల్లో గానీ, భర్తలో కానీ మార్పు వస్తుందనుకుంది. అది రాలేదు.. పైగా ఆమె భర్త తనకి నిప్పంటించాడు. కాలిన గాయాలతో చంటి పిల్లాడిని తీసుకొని పుట్టింటికి చేరింది. కానీ కొన్నిరోజులకే భర్త పిల్లాడిని తీసుకొని వెళ్లిపోయాడు. అయినా ఆమె నిరాశ చెందక ముందుకు సాగాలనుకుంది. ప్రస్తుతం ఆమె టారట్ కార్డ్ రీడర్ గా అందరి భవిష్యత్తులను చెబుతున్నది. అందరికీ భవిష్యత్తు చెప్పగలిగే ఆమె తన కొడుకును ఎప్పుడూ చూస్తుందో మాత్రం తెలుసుకోలేకపోతున్నా అంటూ బాధపడుతున్నది.
గీతాంజలి శ్రీ
ఉత్తరప్రదేశ్ లోని మణిపురీలో పుట్టి, పెరిగింది గీతాంజలి. ఈమె అసలు పేరు గీతాంజలి పాండే. కానీ తల్లి పేరును చివరగా పెట్టుకొని గీతాంజలి శ్రీ అయింది. ఇంగ్లిష్ మీడియంలో చదివినా కూడా హిందీ మీద ఆమెకు మక్కువ ఎక్కువ. అందుకే హిందీ లిటరేచర్ ఎంచుకుంది. కారణం తల్లి వల్లే అంటున్నది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, ఎంఎస్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసింది. అంతేకాదు.. ఈమె వివాడి అనే థియేటర్ గ్రూప్‌తో కూడా అనుబంధం ఉంది. ఈమె అనేక నాటకాలు కూడా రాసింది. వీటితో పాటు ఎన్నో పుస్తకాలు రాసింది. అందులో ‘టాంబ్ ఆఫ్ సాండ్’ నవలకు ‘ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2022’ గెలుచుకుంది. ఏ నవల రచయితకు ఇంతకుమించి సత్కారం అవసరం ఉండదేమో! ఈమె రాసిన రెండు చిన్న కథల సంకలనాలను గుజరాతీ, ఇంగ్లీష్, జర్మన్, సైబీరియన్ వంటి ఇతర భాషల్లోకి అనువదించారు.