ఆస్ట్రేలియాతో ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. 12 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్సులో లభించిన ఒక పరుగుతో మొత్తంగా 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. హెడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 39 పరుగులు చేయగా, లబుషేన్ 19 బంతుల్లో 3 ఫోర్లు కొట్టి 16 పరుగులు చేశాడు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాను జడేజా 6 పరుగుల వద్ద ఔట్ చేశాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్సులో 262 పరుగులకు ఆలైట్ అయింది. ఇక ఈ టెస్టు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. ఇంకా మూడు రోజుల సమయం మిగిలి ఉండగా, మ్యాచ్ అంతవరకు వెళ్లకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పిచ్ రోజులు గడుస్తున్న కొద్దీ బ్యాటింగుకి కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఇదే జరిగితే భారత్‌కి టార్గెట్ ఫినిష్ చేయడం అంత సులువు కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న ఆసీస్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్సులో ధాటిగా ఆడారు. ఎలాగైనా ఈ మ్యాచ్ గెలిచి తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే భావనలో ఉన్నారు.