క్వారంటైన్ సెంటర్‌లో దెయ్యం రచ్చ.. చీపురు కట్టలతో.. - Telugu News - Mic tv
mictv telugu

క్వారంటైన్ సెంటర్‌లో దెయ్యం రచ్చ.. చీపురు కట్టలతో..

May 17, 2020

Srikakulam

కరోనా మహమ్మారితో జనాలు హడలి చస్తుంటే ఓ వ్యక్తి దెయ్యం పట్టినట్టు శ్రీకాకుళం జిల్లాలోని ఓ క్వారెంటైన్ సెంటర్‌లో హల్‌చల్ చేశాడు. దీంతో ఆ క్వారంటైన్ సెంటర్‌లో ఉన్న మిగతావారు ఆందోళన చెందారు. విశాఖ, నెల్లూరు, గుంటూరు లాంటి వేర్వేరు ప్రాంతాల నుంచి వెనక్కు వచ్చిన 45 మంది శ్రీకాకుళం వాసులకు సంతబొమ్మాళి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్ చేశారు. తమకు కరోనా లేదని నర్ధారణ అయింతే ఇళ్లకు వెళ్లిపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. ఇంతలో అర్ధరాత్రి పూట ఓ వ్యక్తి పెద్ద పెద్ద అరుపులు, వింత కేకలు చేశాడు. దెయ్యం పట్టినట్లు పూనకం బూనాడు. పిచ్చి పిచ్చి చేష్టలతో రచ్చ రచ్చ చేశాడు. దీంతో హడలిపోయిన తోటి కూలీలు అతనికి నిజంగానే దెయ్యం పట్టిందని భావించారు. ఇంకే గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చే చీపురుకట్టల ట్రీట్‌మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. 

అందరూ తలా ఒక దెబ్బ వేయడంతో ఆ వ్యక్తికి ఒళ్లు హూనం అయిపోయింది. గట్టిగా పట్టుకుని వెళ్లి సమీపంలోని ఓ ఆలయంలోకి తోసి బయటినుంచి తలుపులు వేసేశారు. కొద్దిసేపు అనంతరం ఆ వ్యక్తి దెయ్యం పారిపోయినట్టు సాధారణ స్థితికి వచ్చాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, రెవిన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ఎవరూ భయ భ్రాంతులకు గురికావద్దని ధైర్యం చెప్పారు. క్వారంటైన్ సెంటర్లలో ఉండలేని వారు కొందరు ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని అధికారులు వెల్లడించారు.