ఆడపిల్లను వద్దంటుండు.. తంతే సక్కగైతడు కొడుకు - MicTv.in - Telugu News
mictv telugu

ఆడపిల్లను వద్దంటుండు.. తంతే సక్కగైతడు కొడుకు

December 1, 2017

ఆలిగా, అమ్మగా, అక్కగా, చెల్లిగా ఆడవాళ్ళ ఆధారం కోరుకుంటున్న మగవాడు కూతురు కావాలని కోరుకోవడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నాడు ? ఒకింటికిస్తే పోతుంది ఆడపిల్ల.. తల కొరివి పెట్టేదాకా తోడుంటాడు కొడుకు అనే భ్రమలో వున్న మగసమాజం కొడుకులతో దండుకున్నదెంత ? కూతుళ్ళతో పోగొట్టుకున్నదెంత ? హైదరాబాద్ బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌ నేత శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆయన రెండో భార్య సంగీత ఆందోళన కొనసాగిస్తున్న ఘటన మరవక ముందే

ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలని వేధిస్తూ కోడలిని ఇంటి నుంచి గెంటివేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం వెదుళ్లకుంటలో వెలుగు చూసింది.

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం యల్లమిల్లి గ్రామానికి చెందిన యాగంటి శివరామకృష్ణ, కనకదుర్గల కుమార్తె శ్రీదేవిని గోపాలపురం మండలం వెదుళ్లకుంట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు మోహనకృష్ణకు ఇచ్చి 2015 మేలో వివాహం చేశారు. కట్నం కింద రూ 15 లక్షలు, 70 కాసులు బంగారం ఇచ్చారు. పెళ్లికి ముందు మోహనకృష్ణకు బెంగుళూరులో పెద్ద ఉద్యోగం వుందని,  23 ఎకరాల పొలం వుందని నమ్మించారు. తీరా పెళ్ళయ్యాక అతనికి ఉద్యోగం లేదు సద్యోగం లేదని తెలిసింది. అయినా ఆ ఇల్లాలు సహనం పాటించింది.

పెళ్ళయ్యాక భార్యకు పెళ్ళిలో పెట్టిన నగలన్నీ అమ్ముకుంటూ, కట్నం డబ్బులు ఖర్చు చేసుకుంటూ కొంతకాలం బెంగుళూరులోనే కాపురం పెట్టాడు. అక్కడే వారికి పాప పుట్టింది. పాప పుట్టడంతో అతనిలోని అరాచకత్వం మేలుకున్నది. భార్యను అనుక్షణం వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అప్పటివరకు పెళ్లిలో వచ్చిన నగదు, నగలు అయిపోవడంతో భార్య పేరు మీద వున్న ఎకరం పొలం మీద అతని దుష్ట కన్ను పడింది. దానిని అమ్ముకొని డబ్బులు తీసుకురావాలంటూ మరింత వేధించసాగాడు.

అతనికి వంత పాడారు అత్తమామలు, ఆడపడుచు. రోజురోజుకూ వారి వేధింపులు శృతి మించడంతో శ్రీదేవి ఉంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వాళ్లు స్పందించకపోవడంతో మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ విషయం తెలిసి భర్త, అత్తామామలు పరారయ్యారు. మహిళా సంఘాల మద్దతుతో శ్రీదేవి అత్తారింటి ముందే ధర్నా చేపట్టింది. తనకు న్యాయం జరిగేవరకు ధర్నా కొనసాగిస్తానంటోంది శ్రీదేవి.