కూతురు ప్రేమించిన వాడితో పెళ్లికి రెడీ అయినా.. ఇంకా పెళ్లి వయసు రాలేదని మందలించినందుకు బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలగిరి మండలం నాగార్జున పేట తండాకు చెందిన ఆంగోతు పాప, కమిలి దంపతులకు ఇద్దరు కుమారులతో పాటు ఇందు(14) అనే బాలిక సంతానం. తల్లిదండ్రులు హైదరాబాదులో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇందు దేవరకొండలోని కస్తుర్బా గాంధీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన బాణావత్ శ్రీను అనే దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు బాణావత్ వినోద్ (20) దేవరకొండలోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
కరోనాతో పాఠశాలలు మూతపడడంతో ఇందుని తన పేరెంట్స్ తండాలో తమతో కూలీ పనులుకు తీసుకెళ్లేవారు. వినోద్ కూడా వారితో పాటు కూలీ పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఈ విషయం కొన్నాళ్లకు పెద్దలకు తెలియడంతో వినోద్ తరపున అతని పేరెంట్స్ ఇందు అమ్మానాన్మల వద్దకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లారు. ఈ క్రమంలో మా అమ్మాయికి ఇంకా పెళ్లి వయసు రాలేదని, ఇప్పుడు పెళ్లి చేయడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో మనసుపడ్డ వాడు దక్కడేమోననే బెంగతో ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. అనంతరం తనే ఈ విషయాన్ని పెద్దలకు చెప్పడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపథ్యంలో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. అవసరమైతే రోషిణి కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించండి; 6202000/2001
మెయిల్; [email protected]