ప్రియురాలు పిలించిందని వెళ్లాడు.. తలుపు తీసి, కొట్టి చంపారు..
పాపం ప్రియురాలు పిలిచిందని వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుని తనవారికి తీరని దుఖ్ఖాన్ని మిగిల్చాడో ప్రేమికుడు. ప్రియురాలి కుటుంబ సభ్యులు అతనిమీద విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టి చంపారు. ఈ ఘటన తమిళనాడులోని పొల్లాచ్చి సమీపంలో చోటు చేసుకుంది. చిన్న పాళయంకు చెందిన గౌతమ్ అనే యువకుడు, సూరస్వర పట్టి గ్రామానికి చెందిన అమ్మాయి(16) ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా గత నెలన్నరగా ఇద్దరూ కలసుకోవడం వీలు కాలేదు. ఇద్దరూ ఎవరి ఇళ్లల్లో వారే ఉంటున్నారు. ఫోన్లు చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రియురాలిని ముఖాముఖి చూడాలని గౌతమ్ ఆశపడ్డాడు. ఈ విషయం ఆమెకు చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతన్ని ఇంటికి పిలిపించుకుంది.
ఇద్దరూ గదిలో ఉండగా, అమ్మాయి తల్లి ఇంటికి వచ్చింది. లోపల మగ గొంతు వినిపించడంతో, ఆమె వెంటనే భర్త, కుమారుడు, తమ్ముడిని పిలిపించింది. వారు ముగ్గురూ కలిసి గౌతమ్‌పై క్రికెట్ బ్యాటుతో దాడి చేశారు. ఈ దాడిలో గౌతమ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను చనిపోతాడన్న భయంతో పోలీసులను పిలిపించారు.
అతను తమ ఇంట్లోకి ఎవరూ లేని సమయాన్ని చూసి చొరబడ్డాడని, ఆత్మరక్షణ కోసం దాడి చేశామని కట్టుకథ అల్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గౌతమ్ మరణించిన తరువాత, పోలీసులు తమ విచారణలో భాగంగా బాలికను గట్టిగా నిలదీశారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పింది. తమవాళ్లే గౌతమ్‌ను పొట్టన పెట్టుకున్నారని తెలిపింది. దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, బాలిక తండ్రి, సోదరుడు, మేనమామను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.