తెలంగాణ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం రూపొందించిన ధరణి వెబ్సైట్లో ప్రభుత్వం కొత్త ఆప్షన్లను ఇచ్చింది. వీటి వల్ల గత ఏడాదిన్నరేళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలకు ఓ దారి ఏర్పడిందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి వివాదాలు లేని భూములు మాత్రమే పట్టా మార్పిడి జరిగేది. పార్ట్ బీలో ఉన్న భూముల పట్టా జరిగేది కాదు. దీంతో అనేక రకాల భూముల రిజిస్ట్రేషన్ జరగకుండా పోయింది. తాజాగా, పాస్ బుక్కులో పేరు మార్పు, భూమి స్వభావం, వర్గీకరణ, నేల స్వభావం, విస్తీర్ణం సరిచేయడం, మిస్సయిన సర్వే నంబర్లను ఎక్కించడం, భూమి అనుభవదారుల కాలంలో పేర్ల మార్పిడికి వీలు దొరికింది. అయితే కొత్తగా తెచ్చిన మార్పుల వల్ల క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.