వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలల్లో భగవద్గీతను బోధించనున్నట్టు గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఆరు నుంచి 12వ తరగతి వరకు సిలబస్లో ఒక పాఠ్యాంశంగా గీతను చేరుస్తున్నామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైతిక విలువలు, ప్రవర్తనను పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీతూ వఘానీ స్పష్టం చేశారు. దీనికి విపక్షాలు ఎలాంటి అడ్డు చెప్పలేదు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తెలిపాయి.