The Governor suggested that the Education Minister should come to the Raj Bhavan to discuss the Universities Bill
mictv telugu

సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్ ఆదేశం

November 7, 2022

The Governor suggested that the Education Minister should come to the Raj Bhavan to discuss the Universities Bill

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌‌‌‌‌‌‌ల మధ్య ఇప్పటికే పలు అభిప్రాయభేదాలు ఉండగా, అందులో మరో అంశం వచ్చి చేరింది. విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. అందులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్‌‌‌కి వచ్చి బిల్లుపై చర్చించాలని సూచించారు. ఈ బిల్లు ఆమోదిస్తే ఏమైనా న్యాయ పరమైన సమస్యలు వస్తాయా? అలాగే జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత మూడేళ్లుగా యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని పదే పదే చెప్తున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గత ఎనిమిదేళ్లలో ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఉమ్మడి నియామక బోర్డు తీసుకువస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని, నియామకాలు ఆలస్యమవుతాయని అభిప్రాయపడ్డారు. దీంతో విశ్వవిద్యాలయాలు దెబ్బతింటాయని.. ఈ అంశాలపై చర్చించడానికి విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్ రావాలని సూచించారు. అటు ఈ బిల్లుపై అభిప్రాయం తెలపాలని యూజీసీకి సైతం గవర్నర్ లేఖ రాశారు. కాగా, అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులు గవర్నర్ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. అందులో విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ఒకటి. దీని ద్వారా పెద్ద ఎత్తున అధ్యాపకులు నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం బిల్లు రూపొందించి గవర్నర్ వద్దకు పంపగా పెండింగులో ఉండడంతో నియామకాలు చేపట్టే వీలు లేకుండా పోయింది. కాగా, రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్ధి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.