సాహో టికెట్ 300 రూపాయలా?.. హైకోర్టు నోటీసు
కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయనగానే హీరోల ఇమేజ్‌ను క్యాష్ చేసుకుందామని థియేటర్ యజమానులు ప్రయత్నిస్తుంటారు. బ్లాక్ టికెట్ల స్థానంలో ఇప్పుడు థియేటర్ యజమానులే బ్లాక్ దందా మొదలుపెట్టారు. ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేక అనుమతులు పొంది డబ్బు పోగేస్తున్నారు. అధిక బడ్జెట్ సినిమాలు అవడంతో మొదటి వారం, రెండు వారాల్లోనే తమ పెట్టుబడిని రాబట్టుకునే క్రమంలో నిర్మాతలు థియేటర్లపై ఒత్తిడి తీసుకురావడం కూడా ఇందుకు ప్రధాన కారణంగా మారింది. భారీ బడ్జెట్‌లో నిర్మితమై, ఈనెల 30న విడుదలకు సిద్ధమైన ‘సాహో’ సినిమాకు కూడా టికెట్ల సెగ అంటుకుంది.
ఈ చిత్రం టికెట్లను అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ‘సాహో’ టికెట్ల ధరలను రూ.100, రూ.200, రూ.300లుగా నిర్ణయించి, వసూలుకు సిద్ధమైనవారి ప్రయత్నాలను అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ నిర్మాత నట్టికుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ జి.శ్యాంప్రసాద్ ముందు విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సాహో సినిమా టికెట్ల ధరలు పెంచకుండా ఆదేశించాలని అభ్యర్థించారు.
దీనిపై సరైన వివరణ ఇవ్వాలని కోరుతూ హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్, సాహో చిత్ర పంపిణీదారు దిల్ రాజు తదితరులకు నోటీసులు జారీచేసింది. భారీ అంచనాల నడుమ విడుదల అవుతున్న ఈ సినిమాని రోజుకి ఆరు ఆటలు ఆడేలా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇప్పించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వాన్ని యూవీ క్రియేషన్స్ కోరింది. వారి విజ్ఞప్తి మేరకు ఈ సినిమాని ఆరు ఆటలు ప్రదర్శించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. అంతేకాక టికెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించింది. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు నిరాకరించింది. టికెట్ల ధరలు అమాంతం పెంచడానికి వీల్లేదని, బెనిఫిట్ షోలకు నో చెప్పింది.