తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి రోజే బీజేపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేయడం తెలిసిందే. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ విధించడంపై ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లారు. తాజాగా పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు బీజేపీ సభ్యులు రేపు స్పీకర్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయమని కోర్టు పునరుద్ఘాటించింది. స్పీకరే సమస్యను పరిష్కరించాలనీ, అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది. ఇదికాక, కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రతినిధులు ఉంటేనే ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలుస్తాయని అభిప్రాయపడింది.