The High Court ordered the state government to take a decision on elections in Manuguru and Bhadrachalam
mictv telugu

తెలంగాణలో మరో రెండు చోట్ల ఎన్నికలు.. రెండు వారాల గడువిచ్చిన హైకోర్టు

November 4, 2022

రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచిన మునుగోడు ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో 93 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని చోట్ల రాత్రి పదిన్నర గంటల వరకు కూడా ఓటర్లు క్యూలో నిల్చొని ఓటేశారు. ఈ ఎన్నిక ఫలితం ఆదివారం రోజు వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మరో రెండు చోట్ల ఎన్నికలు రాబోతున్నాయి. ప్రజాప్రతినిధులు లేకుండా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న ఖమ్మంలోని మణుగూరు, భద్రాచలం పట్టణాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విషయంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గురువారం హైకోర్టు ఆదేశించింది. లేకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు రావాల్సి ఉంటుందని హెచ్చిరించింది. కాగా, ఈ రెండు పట్టణాలు గతంలో పంచాయితీలుగా ఉండేవి.

అయితే వీటిని మునిసిపాల్టీలుగా మారుస్తూ 2005లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, గిరిజన ప్రాంతంలో ఉన్న భద్రాచలానికి మున్సిపాలిటీ చట్టం వర్తించదని, రాజ్యంగ సవరణ ద్వారానే అది సాధ్యమవుతుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే విధించగా, అప్పటి నుంచి ఈ రెండు పట్టణాలకు ఎన్నికలు నిర్వహించలేదు. సుదీర్ఘకాలంగా ప్రత్యేక అధికారుల పాలన కొనసాగించడాన్ని 2020లో వీరయ్య అనే వ్యక్తి హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు.. గత 17 ఏళ్లుగా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తిరిగి పంచాయితీలుగా మార్చి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పి చాలా కాలమైనా ఇప్పటివరకు చర్యలు తీసుకోనందుకు ఆక్షేపించింది. చివరగా, ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రధాన కార్యదర్శిని పిలవాల్సి ఉంటుందని హెచ్చరించింది.