The husband is ready to divorce his wife in the Blade issue in rajasthan
mictv telugu

మరో పెళ్లికై భార్య ఎత్తుగడ.. భర్తను నపుంసకుడిని చేయాలని ఏం చేసిందంటే

November 17, 2022

నచ్చని వివాహం చేసుకున్న ఓ భార్య.. రెండో పెళ్లి కోసం సరికొత్త ఎత్తుగడ వేసింది. భర్తను నపుంసకుడిగా మారిస్తే విడాకులు ఇస్తాడని భావించి దారుణానికి తెగబడింది. తర్వాత నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని చెల్లితో కలిసి కుట్ర పన్ని అది విఫలమై దొరికిపోయింది. రెండు కుటుంబాల మధ్య దాదాపు నెల రోజులు పంచాయితీ నిర్వహించినా తేలకపోగా, చివరకి పోలీస్ స్టేషన్‌‌కి వెళ్లడంతో ఈ ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్ బార్మర్ జిల్లా ధోరిమన్న ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

స్థానికంగా నివాసముండే అన్నారం అనే రైతుకి కనుదేవి అనే యువతితో ఆరు నెలల కింద వివాహమైంది. అన్నారం రైతు కావడంతో రాత్రిళ్లు పొలంలోని షెడ్డులో నిద్రించేవాడు. అతని కుటుంబసభ్యులు పక్కనే మరో షెడ్డులో నిద్రపోతున్నారు. అయితే అన్నారంతో పెళ్లి ఇష్టం లేని కనుదేవి.. ఎలాగైనా తన భర్తతో విడాకులు పొందాలని భావించింది. తాను అనుకున్న కుట్ర గురించి చెల్లితో పంచుకోగా, ఆమె వద్దని వారించినా కనుదేవి వినలేదు. ఓ రోజు భర్త నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి బ్లేడు తీసుకొని భర్త ప్రైవేట్ పార్టును కోసేయాలని చూసింది. కానీ బ్లేడు లోతుగా తెగకపోవడంతో అప్పటికే స్పృహలోకి వచ్చిన భర్త అన్నారం.. గట్టిగా కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వెంటనే స్పందించి అతడిని కాపాడి, మరుసటి రోజు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రమాదం లేదని ధైర్యం చెప్పి కొద్దిసేపటికే ఇంటికి పంపించారు.

అయితే గ్రామీణ ప్రాంతం కావడం వలన భర్త అన్నారం.. అత్తారింటి వాళ్లను పిలిచి పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించాడు. ఇరు వర్గాలు దాదాపు నెలరోజులు పంచాయితీ చేశారు. అప్పటికే తన ప్లాన్ వర్కవుట్ కాలేదనే నిరాశలో ఉన్న కనుదేవి పంచాయితీ ఎంతకూ తెగకపోవడంతో తెగించి అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై పోలీస్ స్టేషన్‌‌లో కేసు వేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తను స్టేషనుకి పిలిపించిన పోలీసులకు అతను జరిగిన వివరాలు మొత్తం చెప్పడంతో నిర్ఘాంతపోయారు. కనుదేవిని పిలిపించి ఎంక్వైరీ చేయగా, అసలు కుట్రను మొత్తం బయటపెట్టింది. తన భర్తతో పెళ్లి ఇష్టం లేదని, నపుంసకుడిని చేస్తే విడాకులు ఇస్తాడని భావించానని తెలిపింది. తాను మరొక వివాహం చేసుకోవచ్చని ఆశపడ్డానని వెల్లడించింది. అప్పటివరకు ఆమె కుట్ర తెలియని భర్త అన్నారం.. తనమీద ఇంత కుట్ర పన్ని తప్పుడు కేసు పెట్టిన కారణంగా తిరిగి భార్యపైనే కేసు పెట్టాడు. అంతేకాక, నిజం తెలిసి తనకు తానే విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీంతో ఆ దిశగా కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు. కాగా, ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. తమ కుట్రలతో ఏమీ తెలియని అమాయక కుటుంబాలను క్షోభకు గురి చేయవద్దని కోరుతున్నారు.