భార్యకు జాబ్.. అసూయతో భర్త ఏం చేశాడంటే - Telugu News - Mic tv
mictv telugu

భార్యకు జాబ్.. అసూయతో భర్త ఏం చేశాడంటే

June 7, 2022

భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని, ఇక తనను లెక్కచేయదని భావించి ఓ భర్త అసూయ పెంచుకున్నాడు. జాబ్ వదిలేయమని భార్య మీద ఒత్తిడి తెచ్చాడు. ఆమె మాట వినకపోవడంతో కత్తితో ఆమె చేయిని నరికేశాడు. ఆధునిక సమాజం విస్తుపోయేలా ఉన్న ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. కోజల్సాకు ప్రాంతానికి చెందిన రేణు ఖాతున అనే అమ్మాయి ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఇటీవల ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వగా, రేణు వాటికి దరఖాస్తు చేసుకొని కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. అయితే ఆమెను అభినందించాల్సిన భర్త షేర్ మహమ్మద్ అందుకు బదులుగా అసూయ పెంచుకున్నాడు. ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎక్కడ తన మాట వినదోనని భయపడ్డాడు. దాంతో ఉద్యోగం మానేయమని ఒత్తిడి తెచ్చాడు. ఆమె మాట వినకపోవడంతో కసితో కత్తితో ఆమె చేయిని నరికేసి పరారయ్యాడు. బంధువులు, స్థానికులు రేణుని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమె చేతిలోని కొంత భాగాన్ని తీసివేసి ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం రేణు కోలుకుంటోంది. పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. చాలా మంది అమ్మాయిలు కూడా వాటికి దరఖాస్తు చేసి ఉన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఉండడంతో వారి వాటా మేరకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతో మహిళా అభ్యర్ధులు, పరీక్షలు రాసే గృహిణులు తమ జాగ్రత్తలో ఉండాలని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.