భవిష్యత్తులో ఎలాంటి కష్టనష్టాలు రాకుండా మనకోసం , మన కుటుంబం కోసం జీవిత బీమా తీసుకుంటాం. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు.. ఆర్ధిక సాయంగా ఉపయోగపడుతుందని, కుటుంబానికి వెన్నుదన్నుగా పాలసీలో చేరతాం. చాలామందికి దీని గురించి అవగాహాన ఉండే ఉంటుంది. కానీ సైబర్ బీమా గురించి మాత్రం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ చూసుకుంటే గతంలో కన్నా డిజిటల్ లావాదేవీలు పెరిగిపోయాయి. దాంతో పాటే ఆన్లైన్ మోసాలూ పెరిగాయి.
ఓటీపీ చెప్పి, లక్కీ డ్రా లో గెలుచుకున్నారని చెప్పి.. ఇలా ఎన్నో రకాల మెసేజ్ లకు రెస్పాండ్ అయి రూ.కోట్ల లో నష్టపోయినవారి గురించి వార్తల్లో విన్నాం, చూశాం. అలాంటి సైబర్ మోసాల నుంచి, అన్ ఆథారైజ్డ్ ట్రాన్సక్షన్స్ నుంచి బయటపడాలంటే కచ్చితంగా సైబర్ ఇన్సూరెన్స్ ఉండాల్సిందేనంటున్నారు నిపుణులు. . చైనా తర్వాత అత్యధిక ఆన్లైన్ యూజర్లు ఉన్నది భారత్లోనే. దాదాపు 70 కోట్ల మంది ఏదో రకమైన డిజిటల్ ఆర్థిక సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ ఇన్సూరెన్స్ ద్వారా వారందరి సమాచారానికి భద్రత ఉండాల్సిన అవసరం ఉంది.
ఈ-కామర్స్, సోషల్ మీడియా, ఆన్లైన్ చెల్లింపులు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్న వారంతా సైబర్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి.. కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ డాటా చోరీ కాకుండా ఉంటుంది. సైబర్ దాడుల వల్ల కొన్ని సందర్భాల్లో నష్టం పూర్తిగా తిరిగి రానప్పటికీ.. తీవ్రత మాత్రం తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం బజాజ్ అలయన్జ్, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, ఫ్యూచర్ జనరలి, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థలు సైబర్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి.
డిజిటల్ ట్రాన్సక్షన్స్ వల్ల జరిగిన ఆర్థిక మోసాల నుంచి ఈ పాలసీలు రక్షణ కల్పిస్తాయి. బ్యాంకు ఖాతాలు, డెబిట్, క్రెడిట్ కార్డులు, మొబైల్ వ్యాలెట్లకు ఈ కవర్లు భద్రతనిస్తాయి.