సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన దాడి ఘటనలో గాయపడ్డ దామోదర్ రాకేశ్ మృతదేహాన్ని అధికారులు వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉదయం కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ రాకేశ్‌ను హుటాహుటిన గాంధీకి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మరణించాడు. మధ్యాహ్నం పోస్ట్ మార్టమ్ అనంతరం.. సాయంత్రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రాకేశ్ మృతదేహాన్ని అతని స్వగ్రామం వరంగల్ జిల్లా దబీర్‌పేటకు తరలించారు. ఆసుపత్రి వద్ద ఆందోళన జరగకుండా అందరి దృష్టి మరల్చి పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు.
మరో వైపు రాకేష్ మరణవార్త తెలియగానే తండ్రి, తల్లి, మేనత్తను పోలీసులు రహస్యంగా తీసుకెళ్లారు. వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పోలీసు వాహనాల్లో తిప్పి కాసేపటి క్రితమే ఇంటికి తీసుకొచ్చారు. తీవ్రంగా రోధించడంతో రాకేష్ తల్లి పూలమ్మ సృహ కోల్పోయింది. పోలీసులు కావాలనే తమను అంతా తిప్పారని రాకేష్ మేనత్త వనమ్మ వాపోయింది.
గ్రామీణ ప్రాంతంలో పుట్టినప్పటికీ… ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది రాకేష్ కల అతడి చిన్ననాటి స్నేహితుడు అరుణ్ అన్నాడు. రాకేశ్ తల్లిదండ్రులు వృద్ధులు అని… సోదరి స్ఫూర్తితో సైన్యంలో చేరాలని అనుకున్నాడని వాపోయాడు.