The Inter Board has taken strict action against Narsingi Sri Chaitanya College
mictv telugu

సాత్విక్ ఆత్మహత్య చేసుకున్న కాలేజీ అనుమతి రద్దు: ఇంటర్ బోర్డ్

March 7, 2023

The Inter Board has taken strict action against Narsingi Sri Chaitanya College

నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ విద్యార్థి సాత్విక్‌ క్లాస్ రూమ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టగా కాలేజీ మేనేజ్‌మెంట్ వేధింపుల వల్లే అతడు సూసైడ్ చేసుకున్నాడని తేలింది. ఈ మేరకు కాలేజీపై ఇంటర్‌బోర్డు కఠిన చర్యలు తీసుకొన్నది. ఆ కాలేజీ గుర్తింపును రద్దు చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్‌ అడ్మిషన్లపై నిషేధం విధించింది. సోమవారం నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ సమావేశంలోనే ఇకపై కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు అడ్డగోలుగా.. తప్పుడు ప్రకటనలు(అడ్వర్టయిమెంట్లు) వేయకుండా, వాటిని నియంత్రించేందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. క్లాసుల పేరుతో ఇష్టం వచ్చినట్లు ఎక్కువ గంటలు విద్యార్థులను ఇబ్బందిపెడుతూ.. వారిని ఒత్తిడి గురిచేయవద్దని, ఇంటర్ బోర్డు నిర్ణయించిన ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే క్లాసులు నిర్వహించాలని ఇంటర్‌ బోర్డు సెక్రటరీ నవీన్ మిత్తల్ స్పష్టం చేశారు. అదనపు వేళల్లో క్లాసులు నిర్వహించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని జూనియర్ కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఒక చోట అనుమతి పొంది మరో చోట కాలేజీ నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

సాత్విక్ సూసైడ్ నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాలేజీ యాజమన్యం అతడిని అసభ్యకరంగా తిట్టడం వల్లే మనస్తాపం చెంది.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. తోటి విద్యార్థుల ముందు కొట్టడం వల్లే మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. చైతన్య కళాశాల అడ్మిన్‌ ప్రిన్సిపల్‌ నర్సింహాచారి అలియాస్‌ ఆచారి, కృష్ణారెడ్డి రోజూ స్వాతిక్ను తిట్టడంతో మానసికంగా కుంగిపోయాడని పోలీసుల విచారణలో తేలింది.మృతుని వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. వీరికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలువడ్డాయి.