భగీరథ’ వెంట ఇంటర్నెట్... - MicTv.in - Telugu News
mictv telugu

భగీరథ’ వెంట ఇంటర్నెట్…

September 1, 2017

మిషన్ భగీరథలో భాగంగా చేపట్టిన టీఫైబర్ ప్రాజెక్టు ఫలాలు పట్టణాలకు, నగరాలకు సైతం అందిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. వాటర్ పై లైన్ తోపాటుగా ఆప్టిక్ పైబర్ లైన్ వేయాలని అదేశాలు అధికారులకు జారీ చేశారు. ప్రతి మునిసిపాలిటీ, కార్పొరేషన్లతో పాటు, వాటర్ వర్క్స్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న పనుల్లో ప్రతి పైపులైను వెంట ఇంటర్నెట్ లైన్లు వేయాలని, దీనికి ఆర్ధికపరమైన అంచనాలు సిద్ధం  చేయాలని చెప్పారు.  

రాష్టంలో టీ ఫైబర్ ద్వారా అనేక విప్లవాత్మక మార్పులు వస్తాయని, గ్రామాల్లో నిర్ణీత లక్ష్యం ప్రకారం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి అవుతుందని అన్నారు. ఒకవైపు గ్రామాల్లో మంచినీళ్లతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ ఇస్తున్నందున, మిషన్ భగీరథ అర్భన్ పనులతోపాటు టీఫైబర్ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు బేగంపేటలో మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ( పబ్లిక్ హెల్త్) అధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా కార్పొరేషన్లలో నగర పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాల ఎర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ మేరకు నగరాలకు ప్రత్యేకంగా నిధులు కూడ ఇచ్చామన్నారు.

అర్భన్ మిషన్ భగీరథ ప్రాజెక్టుతోపాటు టీఫైబర్ ప్రాజెక్టు సమన్వయం చేసుకునేందుకు, ఐటీ మరియు మునిసిపల్ శాఖలు కలిసి పనిచేయాలన్నారు. ఇందుకోసం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎర్పాటు చేసుకోవాలన్నారు. గతంలో వేసిన పైపులైన్లను తవ్వాల్సిన అవసరం లేని చోట ప్రత్యేకంగా ఆప్టిక్ ఫైబర్ వేయాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటు ఫైపులైన్ల నెట్ వర్క్, ఇంటర్నెట్ కేబుల్ నెట్ వర్క్ డిజిటల్ మ్యాపులు సిద్దంగా ఉండేలా ప్రణాళికలు వేయాలన్నారు.

ఇప్పటికే రూరల్ మిషన్ భగీరథలో డక్ట్ వేయడం కోసం ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలని ఏజెన్సీలను కోరారు. పైపులైన్లతోపాటు డక్ట్ వేసేందుకు అయిన అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని, ఈమేరకు లిఖితపూర్వకంగా ఈఎన్ సీ(పీహెచ్ ) అదేశాలు జారీ చేస్తారని మంత్రి తెలిపారు.    

మెత్తం అర్బన్ మిషన్ భగీరథ కోసం మునిసిపల్ శాఖ సన్నద్దతపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. మెత్తం ఎన్ని నిర్మాణాలు, ప్రణాళికల రూపకల్పన, నిధుల సమీకరణ వంటి అంశాలను అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. ప్రతి పట్టణం, నగరం వారీగా చేపట్టాల్సిన పనులను వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం టెంటర్లు పూర్తయ్యాని, పలు చోట్ల పనులు సైతం ప్రారంభం అయ్యాయని అధికారులు తెలిపారు.

ఈ మెత్తం ప్రాజెక్టును వచ్చే జూన్ నాటికి పూర్తిచేయగలిగితే, వచ్చే వేసవికి పట్టణ, నగర ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని మంత్రి తెలిపారు. ఈ మేరకు కాంట్రాక్టు ఎజెన్సీలు పనిచేయాలన్నారు. వారంకోకసారి మిషన్ భగీరథ అర్బన్ పైన సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.