ఉపాధి కోసం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వలసల ద్వారా నగరాల్లో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. వీరికి మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోంది. నగరాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండడమే దీనికి కారణం. దీని వల్ల నగరాలు, పట్టణాల్లో తప్ప గ్రామాలు, చిన్న పట్టణాలు ప్రజలు లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. మన దగ్గర ప్రాసెస్‌లో ఉన్న ఈ దుస్థితి ఎంతో అభివృద్ధి చెందిన ఆసియా దేశమైన జపాన్‌లో ఇప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఆ దేశ రాజధాని నగరమైన టోక్యో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన నగరంగా పేరుగాంచింది. దీంతో మిగతా పట్టణాల్లో జనాభా తగ్గి వ్యాపారాలు దెబ్బతిని ఆస్తుల విలువలు పడిపోతున్నాయి. దీంతో జపాన్ ప్రభుత్వం టోక్యో నుంచి వలసలను ప్రోత్సహించేందుకు నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. సుమారు 3.80 కోట్ల జనాభా ఉన్న టోక్యోను విడిచి వెళ్తే కుటుంబంలోని ఒక్కొక్కరికి 10 లక్షల యెన్లు ఇస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇది గతంలో 3 లక్షలు మాత్రమే ఉండగా, ఆశించిన మేర ఫలితం రాకపోవడంతో ఆ మొత్తాన్ని పెంచింది. గతంలో ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు 30 లక్షల యెన్లు, ఒక్కో బిడ్డకు పైన చెప్పినట్టు 3 లక్షల యెన్లను ప్రకటించింది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు ప్రారంభిస్తే దానికి కూడా అదనపు సాయం అందించింది. ఈ పథకం కింద 2021లో నమోదైన గణాంకాలు చూస్తే కేవలం 2400 కుటుంబాలు మాత్రమే టోక్యోను వీడి వెళ్లాయి. కాగా, దేశంలో జనన రేటు తగ్గిపోతుండడంతో పిల్లలను కనేందుకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చింది.