The job and the salary are not enough..this is the job advertisement
mictv telugu

ఉద్యోగానికి, వేతనానికి పొంతనేలేదు..ఇదేం ఉద్యోగ ప్రకటన

September 1, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న మహానగరాల్లో ప్రస్తుతం సాంకేతిక యుగం నడుస్తుంది. యానిమేషన్ రంగానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులకు ఆయా సంస్థలు భారీ ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌ రాష్ట్రంలో ఓ యూనివర్సిటీ అనుభవజ్ఞులైన యానిమేటర్లను ఆహ్వానిస్తూ, ఓ జాబ్ ప్రకటనను విడుదల చేసింది. ఆ ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియలో తెగ ట్రోలింగ్‌ అవుతుంది.

మొహాలిలో ఉన్న ఓ ప్రైవేటు యూనివర్సిటీ ”యానిమేటర్‌గా నాలుగైదేళ్ల అనుభవం అవసరం. 2డీ, 3డీ, స్టాప్‌మోషన్, కంప్యూటర్ యానిమేషన్, సీజీఐ సాఫ్ట్‌వేర్, మాయా తదితర సాఫ్ట్‌వేర్లలో నైపుణ్యం ఉండాలి. సృజనాత్మకత, టీంవర్క్, అద్భుతమైన ప్రెజెంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. బీడీ/గ్రాఫిక్ డిజైన్, ఫైన్ ఆర్ట్స్ లేదా సంబంధిత రంగాల్లో డిగ్రీ ఉంటే మరీ మంచిది” అని అర్హతల్లో పేర్కొంది.

కానీ, వేతనం మాత్రం నెలకు రూ.10,468 చెల్లిస్తామని పేర్కొంది. దాంతో ఆ ప్రకటనను ఓ నిరుద్యోగి స్క్రీన్ షాట్ తీసి, అందరికి షేర్ చేశాడు. దాంతో ‘ఎంత అన్యాయమైన ఆఫర్ ఇస్తున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను సంపాదించడానికే ఐదారేళ్లు పడుతుంది. దీనికే రూ. లక్షల్లో ఖర్చవుతుంది’ అని ఒకరు, ‘ఇన్ని అర్హతలతో ఎంపికైన తర్వాత అభ్యర్థులు అవతార్ సినిమా కోసం ఏమైనా పని చేస్తారా’ అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొకరు దీనికన్నా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తయారు చేయడం మరింత లాభదాయకమని రిప్లై ఇచ్చారు. ఇలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో..సంబంధిత యూనివర్సిటీ సైతం ఆ ఉద్యోగ ప్రకటనను సవరించింది. కాసేపటికి పూర్తిగా ఆ ఉద్యోగ ప్రకటనను తొలగించింది.