కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఉన్న ఫలంగా చేస్తున్న ఉద్యోగం ఊడిపోవడంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొందరు టెన్షన్‌కు గురయ్యారు. ఇంకొందరు వేరే ఉద్యోగాలకు ప్రయాత్నాలు చేశారు. కానీ, ఓ మహిళ మాత్రం కరోనా కారణంగా తన ఉద్యోగం ఊడిపోయినా, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు అంటూ ఉబర్ రైడర్‌గా మారి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది.
కోల్‌కతాకు చెందిన మౌతుషి బసు (30) అనే మహిళ లాక్‌డౌన్‌కు ముందు పానసోనిక్ కంపెనీలో పనిచేసేది. ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోయింది. ఉద్యోగం పోయిందని ఆమె బాధపడుతూ కూర్చోకుండా కుటుంబ పోషణ కోసం తనకు ఏమాత్రం పరిచయం లేని రంగాన్ని ఎంచుకుంది. ఉబెర్ డ్రైవర్‌గా మారి, బిజీ అయిపోయింది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత రణవీర్ భట్టాచార్య లింక్డిన్లో ఆమె కథను షేర్ చేశారు. దాంతో తెగ వైరల్ అవుతోంది.
రణవీర్ భట్టాచార్య మాట్లాడుతూ..”కోల్‌కతాలో నేను బయటకు వెళ్లేందుకు ఉబెర్ బైక్‌ను బుక్ చేసుకున్నాను. వెంటనే మౌతుషి బసు వచ్చారు. ఆమెను నేను పలు ప్రశ్నలు అడిగాను. వాటికి ఆమె చెప్పిన సమాధానాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. తను పానసోనిక్‌లో ఉద్యోగం చేసేదాన్ని, కరోనా కారణంగా ఉద్యోగం పోయింది. ఆ తర్వాత కుటుంబ పోషణ కోసం ఇలా రైడర్‌గా మారాను అని చెప్పింది. ఓవైపు భారీ వర్షం కురుస్తున్నా ఆమె మాత్రం బండిని చాలా జాగ్రత్తగా నడిపింది, అందుకు అదనంగా డబ్బులు ఏమీ అడగలేదు. గతంలో బండి నడిపిన అనుభవం ఉందా? అని అడిగితే.. కుటుంబాన్ని పోషించుకోవడానికి మరో మార్గం కనిపించలేదు” అని ఆమె చెప్పిందని అన్నారు.