‘మేమూ మీలాగా మనుషులమే. మాకూ ఈ సమాజంలో అన్నీ హక్కులు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని హేళన చేయవద్దు. మీలో ఒకరిగా మమ్మల్ని గుర్తించండి’ ఇలా హిజ్రాలు, ట్రాన్స్జెండర్లు గొంతెత్తి అరిచి చెబుతున్నారు. అయినా వారి మీద చిన్నచూపు, ఎగతాళి, దాడులు, లైంగిక వేధింపులు, హత్యలు వంటివి ఆగడంలేదు. కొందరు మానవత్వంతో వారిని అక్కున చేర్చుకుంటున్నప్పటికీ ఇంకా చాలామందిలో వారిని గౌరవించే మార్పు రావాల్సింది ఉంది. ఆ మార్పు కోసం యావత్ హిజ్రా జాతి వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. అలాంటి మార్పు రావాలంటే ముందు పై స్థాయిలో ఉన్నవారు వారిపట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. రాజకీయాల్లో కూడా వారికి సముచిత స్థానం లభించాలి. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మార్పు వస్తోంది. వారిని కించపరిచే పాత్రలను చూపించడంలేదు. వారి విలువను పెంచే పాత్రలను మలుస్తున్నారు దర్శకనిర్మాతలు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్లో అక్షయ్ కుమార్ తాజాగా నటించిన ‘లక్ష్మీబాంబ్’ సినిమా హిజ్రాల కోణంలో తీసిందే. తమిళం, తెలుగులో ఆ మధ్య వచ్చిన ‘కాంచన’ సినిమాకు లక్ష్మీబాంబ్ రీమేక్. హిందీలో ఈ చిత్రానికి రాఘవ లారెన్సే దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో శరత్ కుమార్ పోషించిన పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. నవంబర్ 9న డిస్నీల్యాండ్ హాట్స్టార్లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లలో అక్షయ్ కుమార్, హీరోయిన్ కియారా అద్వానీ బిజీగా మారారు. ఇందులో భాగంగా ట్రాన్స్జెండర్స్ రైట్స్ కార్యకర్త, బిగ్బాస్ ఫేమ్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని కలుసుకున్నారు. కపిల్ శర్మ షోలో వారు ముగ్గురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కపిల్ వారితో సరదాగా చిట్ చాట్ చేశాడు. లక్ష్మీ నారాయణ్ త్రిపాఠిని ఎంతో ఆప్యాయంగా అక్షయ్, కియారా ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్గా మారింది. హిజ్రా పాత్రలో అక్షయ్ ఒదిగిపోయారని లక్ష్మీ అభిప్రాయపడ్డారు. హర్రర్-కామెడీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఎంటర్టైన్మెంట్, తుషార్ ఎంటర్టైన్ హౌజ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.