Home > Featured > 20 ఏళ్లకు బాలుడి కిడ్నాప్ వెలుగులోకి.. కిడ్నాపరే వెల్లడి..

20 ఏళ్లకు బాలుడి కిడ్నాప్ వెలుగులోకి.. కిడ్నాపరే వెల్లడి..

Kidnapper Revealed..

చేసిన నేరం శాశ్వతంగా దాగదు. ఏదో ఒకరోజు.. ఏదో ఒక సందర్భంలో అది తప్పకుండా బయటపడుతుంది. ఎప్పటికైనా నేరస్థులకు శిక్ష పడటం ఖాయం. ఇది ఎప్పటినుంచో నిరూపితం అవుతున్న నిజం. అయినా నేరగాళ్లు ఆ పూటకు తప్పించుకుని పబ్బం గడుపుకుంటారు. ఆ తర్వాత ఇక చిక్కకపోతే హాయిగా రోజులు గడిపేస్తారు. ఓ నిందితురాలికి ఇదే అనుభవం ఎదురైంది. ఎప్పుడో ఇరవై ఏళ్ల కింద ఓ పసివాణ్ని అపహరించింది. ఆ బాలుడి కోసం అతని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ల చేట్టూ తిరిగారు. కానీ, ఫలితం లేకుండాపోయింది. ఇక ఆ కేసు ఓ మిస్టరీగానే మారిపోయింది. ఈ క్రమంలో ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితురాలు తాజాగా దొంగతనం చేసి పట్టుబడింది. పోలీసులు విచారిస్తుండగా 20 ఏళ్ల కింద బాలుడిని కిడ్నాప్ చేసిన విషయం బయటపెట్టింది.

ఈ ఘటన విజయనగరం జిల్లా జియ్యమ్మవలస పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఓ హెడ్‌కానిస్టేబుల్‌ చాకచక్యంతో ఈ కేసు ఆ కిడ్నాప్ ఘటన తాలూకు వివరాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం ప్రాంతానికి చెందిన సుంకరి భాగ్యలక్ష్మి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులతో నివాసం వుంటోంది. అప్పుడప్పుడు పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతోంది. ఇటీవల జియ్యమ్మవలస ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్సుకు వచ్చారు. అక్కడే వున్న భాగ్యలక్ష్మి అతన్ని పరిచయం చేసుకుని అతని ఇంటికి వెళ్లింది.

ఈ నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారైంది. ఆమె బస్సులో ఉందని సమాచారం అందుకున్న గ్రామస్థులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా 20 ఏళ్ల క్రితం దొంగతనం, ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన విషయాన్ని వెల్లడించింది.

అప్పుడు ఏం జరిగిందంటే..

20 ఏళ్ల క్రితం భాగ్యలక్ష్మి చీపురుపల్లి మండలం వంగపల్లిపేటలో ఓ ఇంట్లోకి చొరబడింది. ఇంట్లో నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలుడిని, 25 తులాల బంగారు ఆభరణాలు, చీరలు, డబ్బులు ఎత్తుకుపోయింది. అపహరణకు గురైన బాలుడి పేరు శంకరరావు. మండల సూర్యారావు, పెంటమ్మ దంపతులకు కుమారుడు. ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీరు నివాసం వుంటున్న పక్కింట్లోనే నిందితురాలు అద్దెకు ఉండేది. అందరితో మంచి సంబంధాలు కలిగివుండటంతో ఆమెపై ఎవ్వరికీ అనుమానం రాలేదు.

ఇదిలావుండగా ప్రస్తుతం ఆ బాలుడు పెద్దవాడై రాజమహేంద్రవరంలో ఉన్నట్లు నిందితురాలు తెలిపింది. అతను ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెప్పింది. ఈ క్రమంలో శంకరరావుతో సోదరి జ్యోతి 20 ఏళ్ల తర్వాత మాట్లాడింది. తన సోదరుడు చిన్నప్పుడే ఎవరో కిడ్నాప్ చేసి చంపేసి వుంటారని భావించానని జ్యోతి తెలిపారు. చాలా ఆనందంగా వుందని ఆమె అన్నారు.

Updated : 24 Aug 2019 5:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top