శాంతించిన కృష్ణమ్మ
భారీ వరదల కారణంగా ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కృష్ణమ్మ ప్రజల మొర ఆలకించినట్టుంది. వరద ఉధృతి తగ్గి శాంతించింది. కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ఉద్ధృతి తగ్గుతోంది. జలాశయానికి 5.54 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..ఔట్‌ఫ్లో 5.35 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 34 గేట్లద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.
జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. మొత్తం 6.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ఔట్‌ఫ్లో 6.50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అలాగే నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 90 అడుగులకు గానూ.. ప్రస్తుతం 586 అడుగులు ఉంది.
మొత్తం 5.25 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు.
మరోవైపు పులిచింతల వద్ద కృష్ణా వరద ప్రవాహం తగ్గింది. జలాశయం వద్ద 5.61 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదుకాగా.. 5.89 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు వుంది.