The list released of those who have assets of 1000 crores in india
mictv telugu

వెయ్యికోట్ల పైన ఆస్తి ఉన్న తెలుగువాళ్లు 78 మంది.. వీరి సంపద ఎంతుందంటే

September 22, 2022

భారత దేశంలో వెయ్యికోట్లు అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారి జాబితాను హురూన్ రిపోర్ట్ ఇండియా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ సంస్థలు విడుదల చేశాయి. వీరిలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 78 మందికి చోటు లభించింది. వీరి మొత్తం సంపదను లెక్కేసి చూడగా రూ. 3 లక్షల 90 వేల 500 కోట్లుగా ఉంది. వీరి సంపద గతేడాదితో పోలిస్తే మూడు శాతం పెరిగింది. ఇందులో దివీస్ లేబొరేటరీస్ రూ. 56, 200 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో హెటిరో ల్యాబ్స్ అధినేత బి. పార్థసారథి రెడ్డి రూ. 39,200 కోట్లు ఉన్నారు. జాబితాలో హైదరాబాదుకు చెందిన వారు 64 మంది, విశాఖపట్టణానికి చెందిన వారు ఐదుగురు, రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఈ జాబితాలో ఎక్కువ మంది ఫార్మా రంగానికి చెందిన వారు ఉన్నారు. తర్వాత స్థానాల్లో పుడ్ ప్రాసెసింగ్, ఫుడ్ అండ్ బేవరేజెస్, నిర్మాణ రంగం, కెమికల్ విభాగాలకు చోటు దక్కింది. 11 ఏళ్ల క్రితం ఈ జాబితాలో తెలుగువారు కేవలం ముగ్గురు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 78కి చేరడం గమనార్హం. ఇదే స్పీడు కొనసాగితే వచ్చే పదేళ్లలో ఈ సంఖ్య 200కి చేరుతుందని కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. దక్షిణ భారతదేశం నుంచి చోటు దక్కించుకున్న వారిలో తెలుగువారే అత్యధికంగా ఉండడం విశేషం. దేశవ్యాప్తంగా చూస్తే మొత్తం వంద లక్షల కోట్లతో 1103 మంది జాబితాలో చోటు సంపాదించారు. అటు అమెరికాలో ఏపీ, తెలంగాణ నుంచి 11 మంది బిలీయనీర్లు ఉండడం గమనార్హం.