బతికినప్పుడు విడగొట్టి.. చనిపోయాక కలిపి ఖననం  - MicTv.in - Telugu News
mictv telugu

బతికినప్పుడు విడగొట్టి.. చనిపోయాక కలిపి ఖననం 

November 18, 2019

love .

కొందరు మనుషులు అంతే.. బతికున్నప్పుడు మనుషుల విలువ తెలుసుకోలేరు. వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. తమ పంతం నెగ్గించుకోవాలని వారి మనసులను కకావికలం చేస్తారు. ఆ బాధతో వారు బలవన్మరణానికి పాల్పడతారు. అప్పుడు అయ్యో ఎంతపని చేశారని నెత్తీనోరు బాదుకుంటారు. అప్పుడు వారికి ఏదేదో చెయ్యాలని భావిస్తుంటారు. కానీ,  ఏం చేసినా పాపం చచ్చినవాళ్లు అయితే లేచి రాలేరు కదా? ప్రేమ అనే విషయంలో పెద్దల మొండి వైఖరికి కన్నీటి సమాధానం చెబుతోంది ఈ విషాధ ప్రేమకథ. వారిద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్ళి చేయడానికి పెద్దలు నిరాకరించారు. దీంతో వారు కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం అని నిర్ణయించుకున్నారు. చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పెద్ద  తమ తప్పు తెలుసుకుని వారిని ఒకే సమాధిలో ఖననం చేయించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలోని రాజారాం తండాలో చోటు చేసుకుంది. 

రాజారాం తండాకు చెందిన భూక్య శిరీష, లకావత్‌ మహిపాల్‌ స్కూల్‌లో చదువుకునేటప్పటినుంచే ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. కలిసి బతకాలని ఆ జంట ఎన్నో కలలు కన్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పి, వారి అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

తమ ప్రేమను ఇటీవలే ఇరు కుటుంబ సభ్యులకు తెలిపారు. పెద్దలు వారి ప్రేమను అస్సలు అంగీకరించలేదు. శిరీష పెద్దవాళ్లు పంతంకొద్దీ ప్రేమించినవాడిని కాదని వేరే యువకుడితో నిశ్చితార్థం చేశారు. పెళ్లికి ఏర్పాట్లు సైతం చేస్తున్నారు. దీంతో వారిద్దరూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పెద్దలను ఎదురించలేక, ప్రేమ పెళ్లి చేసుకోలేక చావే శరణ్యమని భావించుకున్నారు. కరీంనగర్‌లో చదువుతున్న మహిపాల్‌ ప్రియురాలికి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని  స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన శిరీష, మహిపాల్‌తో కలిసి వెళ్లారు. శనివారం సిరికొండ శివారులోని అటవీ ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరిద్దరికి ఆదివారం బంధువులు, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిపారు.

ఇద్దరిని ఒకే గోతిలో ఖననం చేశారు. బతికున్నప్పుడు ఏకం కాని ప్రేమజంట చివరికి మరణంలో ఏకం కావడం, వారిద్దరిని కూడా ఒకే గోతిలో ఖననం చేయడంతో ఆ ప్రాంతంలో విషాధం అలుముకుంది. పెద్దలు వారిపై దయ చూపి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదని తలుచుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు.