లాక్‌డౌన్‌లో పోలీసుల ఔదార్యం - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్‌లో పోలీసుల ఔదార్యం

March 26, 2020

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా దుకాణాలు, అన్నిరకాల వ్యాపారాలు మూతపడ్డాయి. దీంతో విజయవాడ సర్కిల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌, బస్టాప్‌ల్లో తల దాచుకుంటున్న నిరాశ్రయులు, మానసిక స్థితి సరిగా లేనివారు, యాచకులు ఆహారం లేక అలమటిస్తున్నారు. అయితే సాధారణ రోజుల్లో వీరికి పలువురు దాతలు ఏదో రూపంలో ఆహారం అందించేవారు. హోటళ్ల వద్దకు వెళ్లి యాచించి తెచ్చుకుని కడుపు నింపుకునేవారు. లాక్‌డౌన్‌తో వారికి ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. 

దీంతో పోలీసులే వారికి ఆహార పదార్థాల పొట్లాలను అందించి ఆదుకుంటున్నారు. అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి రవాణా సదుపాయం లేక నగరంలో చిక్కుకున్న వారికి ఆహారం అందజేస్తున్నారు. కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో పోలీసులు ఓవైపు కఠినంగా వ్యవహరిస్తునే మరోవైపు మానవతా దృక్పథంతో కూడా వ్యవహరిస్తున్నారు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో భారీగా మోహరించిన పోలీసులు అత్యవసర పనిపై వెళ్తున్నట్లు తగిన ఆధారాలు ఉన్నవారిని తప్ప మిగిలిన వారిని రోడ్లపైకి అనుమతించడం లేదు. అదే సమయంలో అన్నార్థులను ఆదుకుని మానవత్వం చాటుకుంటున్నారు.