మల్లన్నసాగర్ ఆపేదిలేదు.. హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

మల్లన్నసాగర్ ఆపేదిలేదు.. హైకోర్టు

May 16, 2019

ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 47 ఎకరాల కోసం పెద్ద ప్రాజెక్టు పనులను ఆపలేమని తేల్చేసింది. నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని కూడా ఆదేశించింది.

నిర్వాసితుల పిటిషన్‌ను గురువారం విచారించిన కోర్టు పరిహారం తీసుకోవాలని వారికి సూచించింది. పరిహారం తీసుకోని చెక్కులను 46 మంది నిర్వాసితుల తరఫు న్యాయవాదికి ప్రభుత్వం అందజేసింది. పరిహారం చెల్లింపులో అవకతవకలు జరిగితే తమ వద్దకు రావాలని తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై దాఖలైన అన్ని పిటిషన్లనూ కలిపి విచారిస్తామని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు మొత్తం 4,108 ఎకరాలకు గానూ 4,061 ఎకరాలకు నష్టపరిహారం అందజేశామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టు విషయంలో రైతులకు, నిర్వాసితులకు పరిహారం విషయంలో అన్యాయం జరుగుతోందని.. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. అంతేకాకుండా పరిహారం పొందేవారిలో తప్పుడు లబ్దిదారుల పేర్లు బయటకు వస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.  

కాళేశ్వరం, దాని అనుబంధ ప్రాజెక్టులకు సంబంధించి హైకోర్టులో 175కు పైగా పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటినీ కలిపి విచారించాలంటూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం హైకోర్టులో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది.