చెత్త ఏరుకునే మనిషి కోరిక.. 10 లక్షలతో సొంత విగ్రహం రెడీ  - MicTv.in - Telugu News
mictv telugu

చెత్త ఏరుకునే మనిషి కోరిక.. 10 లక్షలతో సొంత విగ్రహం రెడీ 

September 19, 2020

The man who Collecting the worst desire .. Own idol with 10 lakhs will

ఆయనకు బతికుండగానే తన విగ్రాహాన్ని ప్రతిష్ఠించుకోవాలని బలమైన కోరిక. కానీ అందుకు డబ్బు కావాలి. అంత డబ్బు తన వద్ద లేదు. తానేమో చెత్త ఏరుకుని జీవించే బీద మనిషి. కానీ, అతని కోరిక మాత్రం పెద్దది. అయితే ఆయన మాత్రం తన పట్టు వదలలేదు. చెత్త ఏరుతూ పైసా పైసా కూడబెట్టాడు. ఎట్టకేలకు తను అనుకున్న తన విగ్రాహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. తమిళనాడులోని సేలం జిల్లా అత్తనుర్పట్టి గ్రామంలో నివసించే ఆయన పేరు నల్లతంబి (60). ఆయన స్వస్థలం సేలం జిల్లాలోని ఆనైమేడు. తాపీమేస్త్రిగా పనిచేస్తున్న అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. ఓ కుటుంబ వివాదంతో 20 ఏళ్ల క్రితం భార్యాబిడ్డలను వదిలేసి అత్తనుర్పట్టి వచ్చేశాడు. తాపీమేస్త్రిగా పనిచేసి డబ్బును దాచుకున్నాడు. అలాగే చెత్త ఏరుకుంటూ సంపాదిస్తూ జీవించసాగాడు. 

అప్పటినుంచి నల్లతంబికి ఓ కల ఉండేది. సొంతంగా విగ్రహం ఏర్పాటు చేయించుకోవాలని. తన పేరు మార్మోగిపోవాలని అనుకునేవాడు. అందుకోసం అతని ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. దీంతో రోజూ సంపాదిస్తున్న దాంట్లోంచి కాస్త కాస్త కూడబెట్టాడు. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది. తన విగ్రహం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశాడు. వళప్పాడి-బేలూరు రహదారిలో రెండు ప్లాట్లు కొనుగోలు చేశాడు. నిలువెత్తు విగ్రహం తయారు చేయాలంటూ శిల్పికి రూ.1 లక్ష ఇచ్చాడు. అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకుని గత ఆదివారం తాను కొనుక్కున్న స్థలంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దారిన పోయేవాళ్లు ఈ విగ్రహం ఎవరిదబ్బా అని విచిత్రంగా చూడసాగారు. అది పాత ప్లాస్టిక్ సీసాలు ఏరుకునే నల్లతంబిదని తెలియడంతో.. వాళ్లలో ఆసక్తి మరింత పెరిగింది. దీంతో ఆ విగ్రహాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. కాగా, త్వరలోనే తన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఓ పెద్దఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నల్లతంబి భావిస్తున్నాడు.