పాపం మంచోడు.. ఫోన్ ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు - MicTv.in - Telugu News
mictv telugu

పాపం మంచోడు.. ఫోన్ ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు

May 17, 2022

ఫోన్ మాట్లాడుకుంటాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా అని అడిగిన అపరిచిత వ్యక్తికి పోనీలే అని జాలిపడి ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తి కథ ఇది. మధ్యప్రదశ్‌లోని షాదోల్ జిల్లాలో మనోజ్ నెమా (54) అనే ఓ ప్రైవేటు టీచరు నివాసం ఉంటున్నాడు. ఆదివారం రాత్రి సాగర్‌కు వెళ్లేందుకు అజ్మీర్ రైలులో షాదోల్ స్టేషన్ వద్ద రైలు ఎక్కాడు. రైలు ప్రయాణంలో ఉండగా, అపరిచిత వ్యక్తి వచ్చి ‘దయచేసి ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంట్ పని ఉంది. మాట్లాడి మళ్లీ తిరిగిచ్చేస్తాను’ అంటూ రైలు తర్వాతి స్టేషనులో ఆగుతుండగా అడిగాడు. ఇది గ్రహించని మనోజ్ తన ఫోన్ తీసి అపరిచిత వ్యక్తికి ఇచ్చాడు. అపరిచిత వ్యక్తి ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నట్టు నటిస్తూ, రైలు ఆగగానే కిందకు దిగి ఫోన్‌తో సహా పారిపోయాడు. షాకయిన మనోజ్ వెంటనే రైలు దిగి ఆగంతకుడి వెనకాల పరిగెత్తబోయాడు. ఈ క్రమంలో రైలు పట్టాల మీద జారి పడిపోవడంతో ఆ వెంటనే రైలు కూడా మనోజ్ మీదుగా వెళ్లిపోయింది. దీంతో మనోజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే స్పందించిన పోలీసులు అపరిచిత వ్యక్తి రాజేందర్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సహాయం అడిగితే ముందూ వెనకా చూసి చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.